Loksabha Election 2024:
డిసెంబర్‌లోనే ఎన్నికలు..?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని అన్నారు. బీజేపీ ఇందుకోసం ముందుగానే కసరత్తు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుందని, దేశవ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ యూత్ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదని హెచ్చరించారు. ఇటీవల బరాసత్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటన గురించీ ప్రస్తావించారు దీదీ. కొందరు కుట్రపూరితంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీళ్లకు కొందరు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీపైనా ఆరోపణలు చేశారు.
"కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదు. నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుంటోంది. ముందస్తుగానే బుకింగ్స్ చేసుకుని వేరే పార్టీకి ప్రచారం చేసుకునే అవకాశమే లేకుండా చేస్తోంది. ఇప్పటికే బీజేపీ దేశంలో మతాల పేరిట చిచ్చు పెడుతోంది. మళ్లీ ఆ పార్టీయే అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా విద్వేషాలు పెరిగిపోతాయి"
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
మూడు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలదే హవా. ఆ కంచుకోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది TMC.ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వామపక్షాలను ఓడించానని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనీ తప్పకుండా ఓడిస్తానని తేల్చి చెప్పారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో ఉన్న విభేదాలనూ ప్రస్తావించారు. రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని మండి పడ్డారు. ఆ పదవికి గౌరవిస్తానని, కానీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడాన్ని సహించేదే లేదని వెల్లడించారు. మమతా బెనర్జీ కన్నా ముందే పలువురు కీలక నేతలు లోక్‌సభ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశముందని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్‌కే స్టాలిన్ కూడా గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Chandrayaan 3 Rover Pragyan: మూన్ వాక్ లో చంద్రయాన్ రోవర్ కు తప్పిన పెను ప్రమాదం, ISRO అలర్ట్