BJP master plan for Elections: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ(BJP) ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ(Delhi) పీఠాన్ని గెలుచుకుంది. అయితే.. ముచ్చటగా మూడోసారి కూడా ఈ పీఠాన్ని దక్కించుకుని రికార్డు సృష్టించాలని తపిస్తోంది. ఈ క్రమంలో నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఏ ఒక్కరినీ విడిచి పెట్టకుండా అందరినీ ఎన్నికల క్రతువులో పార్టీకి సైనికులుగా మలుచుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఒకవైపు అగ్రనాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amithsha), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(JP Nadda), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi adityanadh) వంటివారితో పాటు.. క్షేత్రస్థాయిలో అన్ని రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికల సంగ్రామంలో కీలక పాత్ర పోషించేలా పార్టీ దిశానిర్దేశం చేస్తోంది.
ఢిల్లీలో ఏం జరుగుతోందంటే!
వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ప్రకటనకు ముందుగానే ఒక దశ-దిశ ఏర్పాటు చేసుకుంటూ.. బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశరాజధాని ఢిల్లలోని భారత మండపం కేంద్రంగా శనివారం నుంచి రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. ఆదివారం(నేడు)తో ఈ సమావేశాలు ముగియనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అగ్రనేతలు కీలకమైన సూచనలు చేస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని నిర్దేశించుకున్న 370 సీట్లు.. ఒక సంఖ్య మాత్రమే కాదని, అదొక సెంటిమెంటు కూడా అని నాయకులు చెబుతున్నారు. ఇక, ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంటులోనూ చెప్పడం గమనార్హం. ఏకపక్షంగా తమకు 370 సీట్లు వస్తాయని.. ఎన్డీయే కూటమితో కలుపుకొంటే.. అవి 400లకు చేరుకుంటాయన్నారు.
సెంటిమెంటు కలిపి..
వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ సెంటిమెంటు సహా.. సిద్ధాంతాలను కూడా తెరమీదికి తెస్తోంది. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడే లక్ష్యంతో ఆర్టికల్ 370 రద్దు కోసం.. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్నే త్యాగం చేశారని, ఆయనకు నివాళిగా 370 సీట్లు గెలవాలని బీజేపీ తన శ్రేణులకు పిలుపునిస్తోంది.
మోడీ వాదన ఇదీ..
ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాల ప్రారంభానికి ముందు పార్టీ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పార్టీ గుర్తయిన కమలం పువ్వే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతుందని, దాని కోసం శక్తివంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 100 రోజుల్లో ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్‌లపైనే దృష్టి పెట్టాలని, 2019లో వచ్చినదానికన్నా ఈసారి ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు అధికంగా వచ్చేలా కృషి చేయాలన్నారు. బీజేపీ 370 సీట్లను, ఎన్‌డీఏ కూటమి 400 సీట్లను గెల్చుకుంటుందని మరోసారి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు అనవసర, భావోద్వేగపూరిత అంశాలను లేవనెత్తుతాయని కానీ వాటి వలలో పడవద్దని బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని సూచించారు. దేశంలో జరిగిన అభివృద్ధి, ప్రజానుకూల విధానాలు, ప్రపంచంలో భారత్‌కు పెరుగుతున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ అంశాల గురించే మాట్లాడాలని చెప్పారు. ఇప్పుడున్నదంతా ‘ఆరోప్ ముక్త్, వికాస్ యుక్త్’ (ఆరోపణలే లేని అభివృద్ధి విధానాల) కాలమని మోడీ పేర్కొన్నారు.
నడ్డా దిశానిర్దేశం
సదస్సును ప్రారంభిస్తూ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వరుసగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రానుందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి పట్టు లేదన్న వాదన వాస్తవం కాదని, ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 28 లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఉంటే బీజేపీకి 29 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలున్నారన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 161 సీట్లలో దాదాపు ఏడాదిన్నరగా పార్టీ నేతలు 430 సార్లు పర్యటించారని, ప్రతి కేంద్ర మంత్రీ ఒక్కొక్క ఓడిపోయిన సీటులో 3 సార్లు పర్యటించారని.. ఈ సీట్లు కూడా గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇవీ తీర్మానాలు..
భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ సమావేశాలకు దాదాపు 11,500 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ సమావేశంలో మొదటిరోజు వికసిత్ భారత్, మోడీకీ గ్యారంటీ, ఫిర్ ఏక్ బార్ మోదీసర్కార్ అనే అంశాలపై చర్చలు జరిగాయి. ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. రామాలయ నిర్మాణం సాకారం కావడమే కాదు.. దేశంలో రామరాజ్యమే ఏర్పడిందని తీర్మానంలో పేర్కొనడం విశేషం.
ఇంటింటికీ..
కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను బీజేపీ కార్యకర్తలు కలిసే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుండ గా.. ఎన్నికల దృష్ట్యా దీనిని మరింత వేగవంతం చేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు కార్యకర్తలకు ఈ నెల 24 వరకూ శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు అందజేస్తారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5వ తేదీ వరకూ ఒక్కో కార్యకర్త బూత్ స్థాయిలో 20 లబ్ధిదారుల కుటుంబాలను కలుస్తారు. పోలింగ్ జరిగే రోజు వరకూ వారితో నిత్యం అందుబాటులో ఉంటారు. లబ్ధిదారు ల అభిప్రాయాలను కార్యకర్తలు సేకరించి పార్టీకి ఎప్పటికప్పుడు అందజేస్తారు. వీటి ఆధారంగా పార్టీ నాయకత్వం ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల జాతీయ కమిటీ పర్యవేక్షిస్తుంది.