2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై  బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకు తగినట్టుగానే బారీ మార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో బలాబలాలు తెలుసుకోడంతోపాటు అధికారంలోకి రావడానికి చేయాల్సిన అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టింది. 


ఈ మధ్య కాలంలో అగ్రనేతలు సమావేశమై 2024 ఎన్నికలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ రెడీ చేశారన్న టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ముందుగా ఆయా రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జల ప్రక్షాళన చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త జాబితాను ప్రకటించారు. ఇందులో మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, సీనియర్లు ఉన్నారు.  
 
గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌రూపాణీని పంజాబ్‌, చండీగఢ్‌కు, త్రిపురా మాజీ సీఎం బిప్లబ్‌ కుమార్‌దేబ్‌ను హర్యానాకు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను కేరళకు, కేంద్ర మాజీ మంత్రి మహేష్‌ శర్మను త్రిపుర ఇన్‌ఛార్జులుగా నియమించారు. గతంలో హర్యానాకు ఇన్‌ఛార్జిగా ఉన్న పార్టీ జనరల్‌ సెక్రటరీ వినోద్‌తావ్‌డేకు బిహార్‌ బాధ్యతలు కట్టబెట్టారు. రాజస్థాన్‌కు అరుణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌కు పి. మురళీధర్‌రావు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. 



బీజేపీ సీనియర్‌ నేత ఓం మాథుర్‌ను ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఉండేవాళ్లు. ఇప్పుడు ఆమెను ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. 2020 నవంబర్‌ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉండేవాళ్లు. ఈ మధ్య ఒడిశా బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌.ఛార్జిగా తప్పించి ఒడిశా బాధ్యతలు కట్టబెట్టారు. ఆమె స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు రాజస్థాన్‌కు చెందిన కీలక నాయకుడు ఓం మాథుర్‌ను నియమించారు.  






ఓం మాథుర్‌ ప్రధానమోదీ, అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గతంలో గుజరాత్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉండేవాళ్లు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇన్‌ఛార్జ్‌గా పని చేసి... బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న బీజేపీ పదిహేను రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ల్లో మార్పులు చేర్పులు చేసింది. ట్రాక్‌రికార్డును బట్టి నేతలకు బాధ్యతలు అప్పగించింది. 


డిసెంబర్‌లో జరిగే ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ ఓం మాథుర్‌తోపాటు మరో ఇన్‌ఛార్జ్‌ను కూడా నియమించింది. ఛత్తీస్‌గఢ్‌కు రెండో ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, అమిత్‌షాకు సన్నిహితుడైన సునీల్‌ బన్సల్‌ను ఎంపిక చేసింది. బిహార్‌ మాజీ మంత్రి మంగళ్‌పాండేకు పశ్చిమ బెంగాల్‌లో పార్టీ బాధ్యతలు అప్పగించారు.