Traffic challans:
ఒకే వ్యక్తికి 70 చలానాలు
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 70 చలానాలు విధించారు. ఏడాదిన్నరలో 70 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించాడా వ్యక్తి. ఈ చలానాలన్నీ కలిపి రూ.70,500 వరకూ ఉన్నాయి. అతని బైక్ వాల్యూ రూ.85 వేలు. అంటే..దాదాపు బైక్ ధర అంత ఉన్నాయి కట్టాల్సిన చలానాలు. ఈ ఏడాది ఇప్పటికే 33 చలానాలు రాగా, గతేడాది 37 చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. సిటీలో అందరి కన్నా ఎక్కువగా చలానాలున్న వెహికిల్స్ వివరాలు వెల్లడించారు. అందులో అత్యధికంగా 70 చలానాలతో ఓ వ్యక్తి టాప్‌లో నిలిచాడు. మిగతా 9 మంది పేరిట కూడా భారీగానే ఫైన్‌లున్నాయి. ఒక్కొక్కరు కనీసం 50 సార్లు రూల్స్ అతిక్రమించినట్టు పోలీసులు వెల్లడించారు. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ కెమెరాలూ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలో భాగంగా వీటిని అమర్చారు. అయితే...ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించిన వాహనాల నెంబర్ ప్లేట్స్‌ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తాయి. ఆటోమెటిక్‌గా చలానాలు జనరేట్ అవుతాయి. ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. వెంటనే ఈ ఫైన్ కట్టకపోతే వెహికిల్స్‌ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనూ భారీ చలానాలు..
అక్కడే కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వాహనదారులు చలాన్లు కట్టకుండా వదిలేస్తున్నారు. పెండింగ్ చలాన్లు కట్టకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకునే వారికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మూడు నెలల్లో రెండు, మూడు ఉల్లంఘనలకు పాల్పడితే రెండింతలు, మూడింతలు జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం, రాంగ్ రూట్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి వాటికి విధిస్తున్నారు. ఇందులో ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన జరిమానా ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌లో ద్విచక్రవాహనానికి రూ. 200, కారుకైతే రూ. వెయ్యి ఫైన్ విధిస్తారు. ఇలా మోటార్ వాహనాల చట్టంలో ఉన్న కీలక సెక్షన్లను ఉపయోగించి ఈ ఫైన్లను విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.100 జరిమానా విధిస్తారు. ఇది ఆ వాహనదారుడు వెంటనే చెల్లించుకోవాలి. కట్టకుండా మరో వారం లేదా పది రోజుల్లో ఇంకోసారి చలానా పడితే, మొదటిది రూ. 100తో పాటు రెండో సారి తప్పు చేస్తే.. రూ.200 వేస్తారు. మొదటి రెండు జరిమానాలు చెల్లించకుండా మరో 15 రోజుల్లో ఇంకోసారి ఉల్లంఘిస్తే.. ఆ మూడు వందలతో పాటు రూ. 100, చట్టాన్ని గౌరవించడం లేదనే కారణంతో మరో రూ.500 జరిమానా వేస్తారు. గత ఎనిమిదేళ్లలో 8.79 కోట్ల ఉల్లంఘనలకు సంబంధించి రూ.2,671 కోట్ల విలువైన జరిమానాలు విధించారు. ఇందులో రూ.900 కోట్లే (33 శాతం) వసూలయ్యాయి. మిగిలిన రూ.1,770 కోట్ల మేర వసూలు కోసం ఈ ఏడాది మార్చిలో రాయితీతో అవకాశం కల్పించారు. కట్టాల్సిన చలాన్లలో బైకర్ల వాటానే అధికం. వీరు చెల్లించాల్సిన మొత్తం రూ.1200 కోట్ల దాకా ఉంది.