Bihar: బిహార్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని బాగ్‌మతి నదిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బపడవలో 33 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే గైఘాట్, బెనియాబాద్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు 17 మందిని ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మిగిలిన 16 మంది విద్యార్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ముజఫర్ పూర్ డీఎం ప్రణవ్ కుమార్ తెలిపారు.






బిహార్ లోని గైఘాట్ బెనియాబాద్ ఓపీ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగ్ మతి నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ అదుపు తప్పడంతో తిరగబడినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, చుట్టు పక్కల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో రోదనలు మిన్నంటాయి. 


ముజఫర్ పూర్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు గురువారం రోజు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడికి వెళ్లే సమయంలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టమని స్థానికులు అంటున్నారు. పడవ బోల్తా పడిన వెను వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో 17 మంది పిల్లలను రక్షించగలిగినట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో చాలా మంది పోలీసులు ఇతర విధుల్లో నిమగ్నమయ్యారని, లేకపోతే మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉండేదని చెబుతున్నారు.






రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.


పడవలో 9, 10 తరగతుల చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నదిని దాటడానికి వేరే మార్గం లేకపోవడంతో పడవలనే నమ్ముకోవాల్సిన పరిస్థితి అని స్థానికులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపడితే ఇలాంటి ప్రమాదాలను భవిష్యత్తులో జరగకుండా చూసుకోవచ్చని, ముఖ్యమంత్రి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.