Ramcharitmanas Remark:



విద్యామంత్రి వ్యాఖ్యలు..


బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సనాతన ధర్మం వివాదం కొనసాగుతుండగా...ఇప్పుడు రామ్‌చరిత్ మానస్‌ గ్రంథంపై ఆయన చేసిన కామెంట్స్‌ మరోసారి రాజకీయాల్ని వేడెక్కించాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామ్‌ చరిత్ మానస్‌ పుస్తకం సైనైడ్ లాంటిదని అన్నారు. హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందూ గ్రంథాల్లో విషం ఉందని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండి పడుతోంది. 


"మీ ముందు 55 రకాల వంటలు తీసుకొచ్చి పెట్టి అందులో పొటాషియం సైనైడ్ కలిపి తినమంటే ఎలా ఉంటుంది..? ఆ ఆహారాన్ని మీరు తింటారా..? హిందూమతంలోని గ్రంథాల్లోనూ ఇలాంటి విషమే ఉంది. చాలా మంది రచయితలు బాబా నాగార్జున్, లోహియాలాంటి వాళ్లూ ఈ గ్రంథాల్లోని విషయాలని వ్యతిరేకించారు. రామ్‌చరిత్‌మానస్‌పై ఉన్న ఈ అభిప్రాయం ఎప్పటికీ మారదు. RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా ఓ సందర్భంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడారు"


- చంద్రశేఖర్, బిహార్ విద్యాశాఖ మంత్రి


ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. రామ్‌చరిత్‌మానస్‌పై చంద్రశేఖర్ పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, నితీశ్ కుమార్‌కి ఇది వినిపించడం లేదా అని ప్రశ్నించింది. నితీశ్ కుమార్‌ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని మండి పడింది. ఇప్పుడే కాదు. గతంలోనూ చంద్రశేఖర్ రామ్‌చరిత్‌మానస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సమాజంలో విద్వేషాలు పెంచే పుస్తకం అని అన్నారు. మనుస్మృతి, రామ్‌చరిత్ మానస్ లాంటి పుస్తకాలు సమాజాన్ని విడగొడతాయని తేల్చి చెప్పారు. 


గతంలోనూ..


నలందా ఓపెన్ యూనివర్సిటీలో బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...రామ్ చరిత్ మానస్, మనుస్మృతి లాంటి గ్రంథాలు సమాజాన్ని చీల్చేస్తాయని, విద్వేషాలు వ్యాప్తి చేస్తాయని అన్నారు. అందుకే మనుస్మృతిని కాల్చేశారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు విద్య అందించడాన్ని వ్యతిరేకించారని  విమర్శించారు. "పాలు తాగాక పాము మనపైనే ఎలా విషం కక్కుతుందో...అలాగే వెనకబడిన వర్గాలు చదువుకుంటే మనపై తిరగబడతారని రామ్‌చరిత్ మానస్‌లో రాశారు" అని చేసిన వ్యాఖ్యలే ఇంత వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య స్పందించారు. ఆ గ్రంథం దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్న మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతే కాదు. ఆ మంత్రి నాలుకను కోసిన వారికి రూ.10 కోట్ల బహుమానం కూడా ఇస్తానని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది జరగకపోతే...ఆయన నాలుక కోసిన వారికి బహుమానం ఇస్తానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రామ్‌చరిత్ మానస్ గ్రంథం...అందరినీ ఏకం చేసేదే తప్ప విడదీసేది కాదని తేల్చి చెప్పారు. అదో గొప్ప మానవతా గ్రంథమని కితాబునిచ్చారు. భారతదేశ సంస్కృతికి ఆ గ్రంథమే నిదర్శనమని, ఇది దేశం గర్వించాల్సిన గ్రంథమని చెప్పారు. 


Also Read: చెట్లను కమ్మేసిన వేలాది గబ్బిలాలు, వణికిపోతున్న ప్రజలు - కేరళలో నిఫా గుబులు