Over 200 killed in Bihar hooch tragedy: Chirag Paswan బిహార్‌లో కల్తీ మద్యం కల్లోలం రేపుతోంది. తాజాగా కల్తీ మద్యానికి కనీసం 37 మంది మృతిచెందారు. దాంతో కల్తీ మద్యం మరణాల సంఖ్య 70 దాటిపోయింది. అయితే కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకూ 200 మందికి పైగా మరణించారని, బిహార్ ప్రభుత్వం ఆ విషయాన్ని దాచిపెట్టిందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. పోస్ట్‌మార్టం నిర్వహిచకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు.
బిహార్ లోని ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు నమోదవుతున్నాయి. వారి మరణానికి మద్యం సేవించడం కారణమని చెప్పకూడదని, లేదంటే వారిని జైలుకు పంపుతామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, సీఎం మౌనం, అధికారుల మద్దతు మరిన్ని అనుమానాలకు కారణం అని జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆరోపించారు. మద్యపానం నిషేధించిన రాష్ట్రం బిహార్ లో కల్తీ మద్యం మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
పెళ్లి వేడుకల్లో కల్తీ మద్యం, పెరుగుతున్న మరణాలు..
2016లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించినా.. బిహార్ లో తరచుగా కల్తీ మద్యం మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల పెళ్లి వేడుకల్లో స్థానికంగా తయారుచేసి మహువా, దేశీ మద్యం సేవించిన తరువాత వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. సోమవారం చనిపోయిన దాని కంటే అధిక సంఖ్యలో గురువారం నాడు కల్తీ మద్యం మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఓ డాక్టర్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. గడిచిన 48 గంటల్లో 24 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించామని శనివారం తెలిపారు. అధికారిక లెక్కలపై స్పష్టత లేదన్నారు.
కల్తీ మద్యం మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ బిహార్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి శుక్రవారం నోటీసులు సైతం జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచే కల్తీ మద్యం సరఫరా అయిందని ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మష్రక్ పోలీస్ స్టేషన్లో ధ్వంసం చేసేందుకు తరలించిన మద్యం అక్కడి నుంచి బయటకు వెళ్లడం తాజాగా వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇదివరకే దాదాపు రెండు వందల మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కొందరు బాధితులు కంటి చూపు కోల్పోగా, మరికొందరు తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్నారు. ఇంకా కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం.