NEET UG 2024 Results: జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఇటీవల నీట్‌ ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్ (NEET UG 2024) పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణలై అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలు పెరిగింది. వీరిలో చాలా మంది సీటు దక్కించుకోవడం కోసం చాలా సార్లు పరీక్ష రాసినవారు ఉన్నారు. తమ కోసం కష్టపడుతున్న తల్లిదండ్రుల శ్రమను గుర్తు చేసుకుంటూ పోరాడి సీటు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఆసక్తికర, స్ఫూర్తిదాయకమైన బిహార్ విద్యార్థుల (Bihar Students) గురించి చదివేయండి.


బిహార్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. వారిలో ఒకరికి రెండు సార్లు నీట్ ఎగ్జామ్ రాసినా సీటు రాకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. తన తండ్రి కష్టాన్ని తలుచుకుని ప్రతి నిమిషం కష్టపడ్డాడు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అనేదానికి మరోర ఉదాహరణగా నిలిచాడు. వైశాలి జిల్లాలోని బంఖోభి గ్రామానికి చెందిన రైతు కొడుకు మహ్మద్ నజీష్. గత రెండేళ్లుగా నజీష్ నీట్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టువిడవకుండా చదివి మూడో ప్రయత్నంలో నీట్ ర్యాంక్ సాధించాడు. నజీష్ తండ్రి ఒక రైతు. పొలం పని చేసుకుంటూ వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే మరో విద్యార్థిని ఇషా కుమారి తొలి పరీక్షలోనే ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి కిరాణా కొట్టు యజమాని కావడం విశేషం.  


మహమ్మద్ నజీష్ తన గ్రామంలోని జ్ఞాన్ సరోవర్ అనే చిన్న పాఠశాలలో చదువును ప్రారంభించాడు. 10, 12వ తరగతులను అక్కడే పూర్తి చేశాడు. ఆ తరువాత వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంలో రాజస్థాన్‌లోని కోటకు వెళ్లాడు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నజీష్ తండ్రి కొడుకును రాజస్థాన్‌లోని కోటకు పంపించాడు. 2021లో నజీష్ తొలిసారి నీట్ పరీక్ష రాశాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ నాజీష్ పట్టు వదల్లేదు. 2023లో రెండో సారి నీట్ పరీక్షకు హాజరయ్యాడు. అప్పుడు కూడా క్వాలిఫై అవ్వలేదు. అయినా పట్టువిడువని నజీష్ తన పోరాటాన్ని కొనసాగించాడు. 2024లో మూడో ప్రయత్నం చేశాడు. ఈ సారి అతని పట్టుదలకు ఫలితం దక్కింది. నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో అతని కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భవిష్యత్తులో మంచి డాక్టర్‌ అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు నజీష్ తెలిపాడు.


సీటు సాధించిన కిరాణా కొట్టు యజమాని కూతురు
మహమ్మద్ నజీష్ తరహాలోనే బీహార్‌లో మరో విద్యార్థి నీట్ సీటు సాధించింది. ముజఫర్‌పూర్‌లోని అంగోలాకు చెందిన ఇషా కుమారి నీట్ పరీక్షలో 99.13 పర్సంటైల్ సాధించింది. ఆల్ ఇండియా స్థాయిలో 19,895 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 8,769 ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి కృష్ణ కుమార్ కిరాణా దుకాణం నడుపుతుండగా, ఆమె తల్లి గృహిణిగా పని చేస్తున్నారు. ఇషా తల్లి గతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసేవారు. పిల్లలు, భర్తను  చూసుకోవడానికి ఆమె ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఇషా మాట్లాడుతూ.. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పింది. తల్లిదంద్రులు తనను ఎంతో కష్టపడి చదివించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఇషా కుమారి అన్నారు.