Nitish Kumar: 



ఎన్‌డీఏలోకి జేడీయూ..?


జేడీయూ మళ్లీ NDA కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొంత మంది బీజేపీ నేతలూ ఇదే విషయాన్ని నేరుగా కాకపోయినా పరోక్షంగా చెప్పారు. ఏడాది క్రితమే NDA లో నుంచి బయటకు వచ్చి RJDతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్ యాదవ్. తేజస్వీ యాదవ్ డిప్యుటీ సీఎం బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో ఇదో సంచలనమైంది. బీజేపీ నితీశ్‌పై తీవ్రంగా మండి పడింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేదని విమర్శించింది. అయితే...కొంత కాలంగా మళ్లీ JDU ఎన్‌డీఏలో చేరుతుందన్న వార్తలు వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఆలోచనే లేదని కొట్టి పారేశారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేయడమే తన కర్తవ్యం అని, అంతకు మించి ఇంకేమీ ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "ఏంటీ పనికి రాని మాటలు" అంటూ ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమిలో పెద్ద దిక్కుగా ఉన్నారు నితీశ్ కుమార్. మొదటి నుంచి ఆయనే అన్ని పార్టీలనూ సమన్వయ పరుస్తున్నారు. అయితే..అటు బిహార్‌లోని జేడీయూ నేతలు మాత్రం నితీశ్‌ని ప్రధాని అభ్యర్థి గానూ ప్రచారం చేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, సీనియర్ నేత మహేశ్వర్ హజారీ ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థిగా నిలబడే అర్హత, సామర్థ్యం నితీశ్‌కి తప్ప మరెవరికీ లేదని అన్నారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై నితీశ్‌ని ప్రశ్నించగా..సమాధానం దాటవేశారు. డిప్యుటీ సీఎంని అడగండి అంటూ వెళ్లిపోయారు. 


పదవులపై ఆసక్తి లేదట..


కూటమికి పేరైతే పెట్టారు కానీ...ఇప్పటి వరకూ లీడ్ చేసేది ఎవరన్నది ప్రకటించలేదు. మొదటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరే వినిపిస్తోంది. ఆయనే I.N.D.I.A కూటమికి కన్వీనర్‌గా ఉంటారని చాలా మంది నేతలు చెప్పారు. దీనిపై నితీష్ కుమార్ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. తనకు ఏ పదవిపైనా ఆసక్తి లేదని, కేవలం అన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. కూటమి నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన గట్టిగానే స్పందించారు. అలాంటి ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు.  విపక్షాలు యునిటీగా పోరాటం చేయాలని నితీష్ కుమార్ భావిస్తున్నా...కొన్ని పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తుతున్నాయి. వాటిని తీర్చేందుకు నితీష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 


"నాకు ఏ పదవిపైనా ఆసక్తి లేదు. ఇదే విషయాన్ని నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు కన్వీనర్ పదవిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కేవలం అన్ని పార్టీలను కలపడమే నా పని. అదే నా లక్ష్యం"


- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 


Also Read: ఢిల్లీ మెట్రో రైల్‌లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో