Next Pandemic: 


సైంటిస్ట్‌ల వార్నింగ్..


ప్రపంచంపై మరో మహమ్మారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కొవిడ్‌ 19 కేవలం ట్రైలర్ మాత్రమే అని..అసలు వైరస్‌లన్నీ ముందు ముందు దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పారు. యూకేలోని వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బింగమ్ (Dame Kate Bingham) ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి వచ్చే మహమ్మారి కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు బలి తీసుకుంటుందని అంచనా వేశారు. కొవిడ్ 19 ఈ స్థాయిలో ప్రభావం చూపించకపోవడం మనందరి అదృష్టం అని అన్నారు డేమ్. కొత్త మహమ్మారికి "Disease X" అని పేరు పెట్టారు. బహుశా ఇది త్వరలోనే ప్రపంచాన్ని వణికిస్తుండొచ్చు అని ఆందోళన కలిగించే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కొవిడ్‌తో పోల్చుకుంటే డిసీజ్ X 7 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు డేమ్ కేట్ బింగమ్. 1918-19 నాటి ఫ్లూని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ఈ వ్యాధి  5 కోట్ల మందిని బలి తీసుకుంది. 


"కొవిడ్ కన్నా 7 రెట్లు ప్రమాదకరమైన వైరస్ త్వరలోనే దాడి చేసే అవకాశముంది. 1918-19 నాటి ఫ్లూ లాగానే ఇప్పుడూ కోట్ల మంది ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండొచ్చు. ఇప్పటికీ కొన్ని వైరస్‌లు ఎప్పటికప్పుడు మ్యుటేట్ అవుతూ దాడి చేస్తున్నాయి. వీటిలో అన్ని వైరస్‌లూ ప్రమాదకరం కావు. కానీ...కొన్ని మాత్రం ప్రాణాలు తీస్తాయి. ప్రస్తుతానికి 25 రకాల వైరస్‌లపై అధ్యయనం జరుగుతోంది. వీటిలో ప్రతి వైరస్...మళ్లీ వేల వైరస్‌లుగా రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. అవే మహమ్మారిగా మారుతున్నాయి. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు"


- డేమ్ కేట్ బింగమ్, యూకే వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ 


అధ్యయనం..


కొవిడ్ సోకిన వారిలో కొందరు త్వరగానే కోలుకున్నారని, కానీ రాబోయే వైరస్ మాత్రం మీజల్స్, ఎబోలా స్థాయిలో ప్రాణాల్ని బలి తీసుకునే ప్రమాదముందని హెచ్చరించారు డేమ్. అటు యూకే శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌లు తయారు చేసుకునే పనిలో పడ్డారు. హైసెక్యూరిటీతో ఓ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. 200 మంది సైంటిస్ట్‌లు అందుకోసం శ్రమిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ, మంకీఫాక్స్, హంటావైరస్ లాంటి జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపైనా అధ్యయనం జరుగుతోంది. 


కరోనా ఇక మన నుంచి దూరమైనట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ అదనామ్ టెడ్రోస్ మరో బాంబు పేల్చారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కూడా హెచ్చరించారు. అది కొవిడ్ కన్నా దారుణంగా ఉండొచ్చని అన్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్‌ వ్యాప్తి తగ్గిపోతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. "కొవిడ్‌ 19 ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా తొలగించినంత మాత్రాన..ఎవరికీ ఎలాంటి ముప్పు లేదని కాదు" అని తేల్చి చెప్పారు. 


Also Read: మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్! సర్వేల్లో బైడెన్ కన్నా ఎక్కువ పాయింట్స్