మహారాష్ట్ర: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) చీఫ్ శరద్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు గడియారంను అజిత్ పవార్ వర్గానికి కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు కొంతకాలం నుంచి కొనసాగిన ఎన్సీపీ రాజకీయ సంక్షోభానికి ఎన్నికల సంఘం మంగళవారం ఫుల్ స్టాప్ పెట్టింది. పార్టీ అధినేత శరద్ పవార్‌ నుంచి ఎన్సీపీ పేరును, పార్టీ గుర్తును అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. 6 నెలల్లో దాదాపు 10కి పర్యాయాలు విచారణ జరిపి, ఇరువర్గాల వాదనలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఎట్టకేలకు ఎన్సీపీ అంటే అజిత్ పవార్ అని ప్రకటించిన ఈసీ, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు ఊహించిన షాకిచ్చింది.






మహారాష్ట్ర నుంచి 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో శరద్ పవార్ వర్గానికి సైతం ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 39AAకి లోబడి ప్రత్యేక అవకాశం ఇచ్చింది ఈసీ. కానీ కొత్త పార్టీ పేరు, గుర్తును ఎంపిక చేసుకోవడానికి శరద్ పవార్ కు 24 గంటల గడువు కూడా లభించకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు.


ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ హర్షం.. 
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వాగతించారు. తమ తరఫు లాయర్ల వాదనలు విన్న తర్వాత ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ హర్షం వ్యక్తం చేశారు.