Daggubati Purandeswari: నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరింది. ఇప్పటికే కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేసేసింది. ఎంపీల ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందేమోననే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడమే ఇందుకు కారణం. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూలకు ఈ పదవి దక్కుతుందని తొలుత ప్రచారం జరిగింది. కీలకమైన స్పీకర్ పదవి కోసం టీడీపీ, జేడీయూ కొంతకాలం పట్టుబడినట్లు సమాచారం.


రాజ్‌నాథ్‌కు ఆ బాధ్యత
కానీ బీజేపీ ఆ అవకాశం మిత్రపక్షాలకు ఇవ్వలేదు. తన పార్టీకి చెందిన వ్యక్తినే స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు బీజేపీ అప్పగించింది. ఇటీవల బీజేపీ పెద్దలు సైతం దీనిపై స్పందిస్తూ మిత్ర పక్షాల నుంచి స్పీకర్ పదవిపై ఎటువంటి షరతులు పెట్టలేదని ప్రకటించారు. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి కోసం పోటీ పడడం లేదని టీడీపీ లీకులు ఇస్తూ వచ్చింది. జేడీయూ సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బీజేపీకి స్పీకర్ పదవి దాదాపు ఖాయం అయినట్లు అయినట్లు తెలుస్తోంది. 


సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ పాత్ర కీలకం
సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు స్పీకర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎంపీలపై అనర్హత వేటు, ఫిర్యాదులు, ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. తాజాగా బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో క్లిష్ట సమయాల్లో స్పీకర్ తమ వ్యక్తి అయితేనే బాగుంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తమ పార్టీ నేతనే స్పీకర్ సీట్లో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే రాజ్ నాథ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన 2004 నుంచి ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో సమావేశమై ఏకాభిప్రాయంతో స్పీకర్ స్థానాన్ని భర్తీ చేయడంలో కీలకంగా వ్యవవహరిస్తున్నారు.  


స్పీకర్ రేసులో ఉన్నది వీరే
స్పీకర్ రేసులో ప్రముఖంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పేర్లు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి మహిళ కావడం, దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు కలిసొచ్చే అంశాలు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే ఆమె రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా విజయం సాధించారు. ఆమెకు స్పీకర్ స్థానం ఇస్తే టీడీపీ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ పదవి కోసం టీడీపీ పట్టుబట్టకపోవచ్చని బీజేపీ భావిస్తోంది. అలాగే భర్తృహరి మహతాబ్ సైతం ఏడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కటక్ నుంచి ఎంపీగా గెలిచారు. 


డిప్యూటీ స్పీకర్ కోసం ఇండియా కూటమి పట్టు
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌గా జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉండడంతో స్పీకర్ రేసు నుంచి జేడీయూ కూడా దాదాపు తప్పుకున్నట్టే. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడంపైనే ఆసక్తి చూపుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తమకు సహకారం కావాలని, అందుకు తాము బీజేకి మద్దతు ఇస్తామని చెబుతోంది. అయితే ఇండియా కూటమి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతోంది. అలా ఇవ్వకపోతే స్పీకర్‌కు అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరిస్తోంది. బీజేపీ మాత్రం ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది.