భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల బలం, పరిస్థితిని చూసిందని.. దేశ రాజకీయాలపై తన పాదయాత్ర ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం శ్రీనగర్‌లో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించిందన్నారు. తన ఈ పాదయాత్ర ప్రయాణంలో ప్రజల దృఢత్వం, బలాన్ని చూశానన్నారు. దేశంలో రైతులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, స్వయంగా చూశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.


భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్య, ఆక్రమణపై సైతం రాహుల్ స్పందించారు. చైనా సైన్యం మన భూమిని ఆక్రమించిందని అంగీకరించడానికి నిరాకరించే కేంద్ర ప్రభుత్వ విధానం అత్యంత ప్రమాదకరం అన్నారు. చైనాతో మన దేశం మరింతగా పోరాడి మన భూమిని పరాయి దేశస్తుల పరం కాకుండా చూడాలన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతపై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా.. ‘మీడియా ఒకే పక్షానికి, కొన్ని వర్గాలకు అవకాశం ఇస్తోంది. అందరినీ ఒకేలా చూడటం లేదు. సమస్యలను సరైన రీతిలో ప్రజలకు తెలియజేప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య కొన్ని విషయాలలో విభేదాలు ఉండవచ్చు కానీ ఆర్‌ఎస్‌ఎస్ - బిజెపిలకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం కొనసాగిస్తాం అన్నారు.
భారత్ జోడో యాత్ర బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్ ద్వేషం, దురహంకారానికి ప్రత్యామ్నాయాన్ని చూపిందన్నారు రాహుల్ గాంధీ.  జమ్మూ-కాశ్మీర్‌లో రాజ్యాధికారం, ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ చాలా ముఖ్యమైనవి. కానీ జమ్మూ కాశ్మీర్‌లో తాను చూసిన పరిస్థితులతో సంతోషంగా లేనన్నారు. తనకు చేతనైనంతలో సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చానన్నారు. 


అంతకుముందు కన్యాకుమారి టు కాశ్మీర్ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ నడిబొడ్డున లాల్ చౌక్‌లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా, గత ఏడాది సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలోమీటర్లు, 75 జిల్లాల్లో ప్రయాణించి ఆదివారం శ్రీనగర్‌కు చేరుకున్నారు.


జమ్మూ & కాశ్మీర్‌లోని పంథా చౌక్ శ్రీనగర్ లో భారత్ జోడో యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నదీమ్ జావీద్, కే.మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీపీ, ఎన్.గిరిధర్ రెడ్డి రాహుల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

70 ఏళ్ల తర్వాత నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని విషయాన్ని జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా గుర్తు చేసుకున్నారు. శాంతి సౌభ్రాతృత్వం కోసం ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు అన్నారు. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అవకాశం వచ్చే పరిస్థితులు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు క్రెడిట్ దక్కుతుందన్నారు.