Bengaluru Metro Pillar Collapse: కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిన ప్రమాదంలో ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. బెంగళూరు నగరంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనంపై స్టీల్‌ కడ్డీలు ఉన్న మెట్రో పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో తల్లీకొడుకులు మృతి చెందినట్లు ఏబీపీ న్యూస్‌కు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంపై మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో పిల్లర్‌ నిర్మాణం కోసం వేసిన టీఎంటీ బార్‌లు కూలిపోయాయి. అదే సమయంలో స్కూటర్‌పై వెళ్తున్న వారిపై పడటంతో ఈ విషాదం జరిగింది. మెట్రో పిల్లర్ ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువ గా ఉందని, టన్నుల బరువు కలిగి ఉన్నట్లు వార్తా సంస్థ PTI రిపోర్ట్ చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు ఇది గమనించి తల్లీకొడుకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు చనిపోయారని నిర్ధారించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని తేజస్విని, విహాన్ లుగా గుర్తించారు.
  
నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోయి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనంపై పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఆమె కుమారుడు చనిపోయారని బెంగళూరు ఈస్ట్ డిసిపి డాక్టర్ భీమశంకర్ ఎస్ గులేద్ ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్, ఇతర విభాగాల నిపుణులను ఘటనా స్థలానికి పంపి పరిశీలించినట్లు చెప్పారు.






ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తి ఇద్దరి ప్రాణాలు తీసింది..
బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో ఇద్దరి చనిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమిషన్ల కక్కుర్తి కారణంగా తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్ పనులు ఎంత నాణ్యతతో చేపట్టాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంపై భార్యాభర్తలు, కవల పిల్లలు వెళ్తున్నారని వీరిలో కుమారుడు, తల్లి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.