Bengaluru Blast Case Updates: బెంగళూరు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడికి సంబంధించిన ఆచూకీ గానీ వివరాలు గానీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామని NIA ప్రకటించింది. ఈ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో పది మంది గాయపడ్డారు. కేఫ్‌లోని ఓ బ్యాగ్‌లో IEDని గుర్తించారు. కేఫ్‌లోని సీసీ కెమెరాలో నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మాస్క్‌, టోపీ, గ్లాసెస్ పెట్టుకుని పూర్తిగా ఫేస్‌ని కవర్ చేసుకున్నాడు. కేఫ్‌కి వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ తరవాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ని అక్కడే చెట్టు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే బాంబు పేలింది. కేఫ్‌లోనే దాదాపు 9 నిముషాల పాటు నిందితుడు ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. 






దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్‌ ‌లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌‌లో పేలుడు కేసును నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) చేతికి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు చేసేందుకు కేసు బదిలీ చేయడంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనపై తాజాగా ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ పేలుడు జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీజేపీ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారన్న విషయంలో ఇప్పటికే మండి పడుతోంది. ఇప్పుడీ పేలుడు ఘటనకీ దాన్ని లింక్ చేస్తోంది. పాకిస్థాన్ జిందాబాద్‌ నినాదాలు చేసిన వారికి, ఈ పేలుడుకి కచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని ఆరోపిస్తోంది. అటు పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు అనుమానితులకు పేలుడు ఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితుడికి సహకరించినట్టు తెలుస్తోంది. 


"8 టీమ్స్‌తో విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. CC కెమెరాల ఫుటేజ్‌ని సేకరిస్తున్నాం. ప్రతిపక్షాలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు. మంగళూరు పేలుడు కేసుకి, దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. NSG వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశమయ్యాను. బీజేపీ అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలి"


- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి