Sanatana Remarks: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈలోగా మద్రాస్ హైకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. ఆయనని మంత్రిగా కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ని కొట్టివేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమే అయినప్పటికీ...ఇప్పటి వరకూ ఏ కోర్టులోనూ ఆయన దోషిగా తేలలేదని గుర్తు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతేడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగీ లాంటిదని దాన్ని సమాజంలో నుంచి పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మరో మంత్రి పీకే శేఖర్ బాబు, డీఎమ్‌కే ఎంపీ ఏ రాజాని పదవి నుంచి తొలగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ ఇద్దరూ వాటిని సమర్థించడమూ విమర్శలకు తావిచ్చింది. అయితే..తన వ్యాఖ్యల్ని అనవసరంగా తప్పుదోవ పట్టించారని, కేవలం కుల వ్యవస్థపైనే విమర్శలు చేశానని వివరణ ఇచ్చారు. హిందూమతాన్ని తాను తప్పుపట్టలేదని వెల్లడించారు. న్యాయపోరాటానికి సిద్ధమే అని స్పష్టం చేశారు.
ఉదయనిధి స్టాలిన్‌పై కేవలం తమిళనాడులోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. అయితే...వీటన్నింటినీ కలిపి ఒకటే కేసుగా పరిగణించాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఉదయనిధి. కానీ...సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా స్పందించింది. మంత్రి అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ మండి పడింది. ఆచితూచి మాట్లాడాలని మందలించింది.
"భావప్రకటనా స్వేచ్ఛని మీ అంతట మీరే దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకూ తీసుకొచ్చారు. మీరు మాట్లాడినదానికి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేకపోయారా..? మీరు ఏమీ తెలియని వ్యక్తి కాదుగా. మీరో మంత్రి పదవిలో ఉన్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కచ్చితంగా అంచనా వేసుకోవాలి"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ సనాతన ధర్మ వివాదంపై గతంలో స్పందించారు. అనవసరంగా ఉదయనిధి స్టాలిన్‌ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. కోయంబత్తూర్‌లో పార్టీ మీటింగ్‌కి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తకుండానే ఓ చిన్న పిల్లాడిపై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. కేవలం సనాతన ధర్మం అనే పదం వాడినందుకే ఇంత రభస చేస్తున్నారని మండి పడ్డారు. ఈ వివాదం కొత్తేమీ కాదని, ద్రవిడ ఉద్యమం సిద్ధాంతమే ఇది అని తేల్చి చెప్పారు. ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన నేతలందరికీ సనాతన ధర్మంపై ఇలాంటి అభిప్రాయమే ఉంటుందని వివరించారు.
Also Read: సూపర్ ట్యూస్‌డే ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటాపోటీ - అధ్యక్ష ఎన్నికలకు ఇది టీజర్ మాత్రమే!