Bengal Governor: రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య ఘర్షణ పూర్తి వాతావరణం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నదే. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ రాజ్‌భవన్‌, సీఎంవో మధ్య అలాంటి వాతావరణమే ఉంది. ఇరు వైపుల నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు వస్తూనే ఉన్నాయి. మాటలతోనే యుద్ధం సాగిస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తానని దీదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ బయట ఎందుకు నిలబడతారని.. వారు కోరుకుంటే రాజ్ భవన్‌ లోపలికే వచ్చి నిరసన చేసుకోవడానికి ఆహ్వానం ఇస్తానంటూ గవర్నర్ కౌంటర్ ఇచ్చారు. 


'నిరసన చేయాలని అనుకుంటే రాజ్ భవన్ లోకే వచ్చి ధర్నా చేసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తా. బయట ఎందుకు నిల్చోవాలి' అని గవర్నర్ సీవీ ఆనంద బోస్ అన్నారు. 


అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను ఆమోదించడం లేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దీదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ గవర్నర్ పై విమర్శలు చేశారు. పలు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ తన వద్దే ఉంచుకోవడంపై దీదీ మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజ్‌ భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. 


పశ్చిమ బెంగాల్ కొత్త సంవత్సరాన్ని పొలై బైసాకీ రోజునే సెలబ్రేట్ చేసుకునేందుకు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే రాష్ట్ర గవర్నర్ ఈ తీర్మానానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న బీజేపీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఒకవేళ ఇక్కడ తీర్మానం చేసినప్పటికీ.. గవర్నర్ ఆమోదం తెలపరని ఆ పార్టీ నేత సువేందు అధికారి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. గవర్నర్ ఆమోదించినా, ఆమోదించకపోయినా.. బెంగాలీ కొత్త సంవత్సరాన్ని జూన్ 20వ తేదీన జరుపుకోనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.


ఎమ్మెల్యేల జీతాలు పెంచిన దీదీ


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ గురువారం రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభలో ఇవాళ ప్రకటన చేశారు దీదీ. ఒక్కొక్కరికీ నెలకు రూ. 40 వేలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జీతంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ.. ఎలాంటి జీతమూ తీసుకోకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ సభ్యుల జీతాలు తక్కువగా ఉన్నాయని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దీదీ తెలిపారు.