Sanatan Dharma Row:
కాంగ్రెస్ దూరం దూరం..
కూటమిగా ఏర్పడిన తరవాత అందరి మాటా ఒకటే ఉండాలి. అందరి బాటా ఒకటే అవ్వాలి. కానీ...I.N.D.I.A కూటమిలో మాత్రం ఈ ఐక్యత కనిపించడం లేదు. అందుకు కారణం...ఒక్కో పార్టీది ఒక్కో సిద్ధాంతం అవడం. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీల సిద్ధాంతాలు ఆధారపడి ఉంటాయి. ఇది సహజమే. ఇలా సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు ఒక్క చోటకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని విషయాల్లో "మేము ఒక్కటే" అని చెప్పక తప్పదు. ఇప్పుడు సనాతన ధర్మం చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో ఆ యునిటీ లేదని క్లారిటీ వచ్చేసింది. ద్రవిడ రాజకీయాల సిద్ధాంతం మొదటి నుంచి హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే ఉంది. అదే మరోసారి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఈ మాత్రం సంచలనం కోరుకోవడం పొలిటికల్ వ్యూహమే. తమిళనాట ఈ రాజకీయాలు చెల్లుతాయి. కానీ...అన్నిచోట్లా ఇది వర్కౌట్ అవ్వదు. అందుకే కాంగ్రెస్ ఈ విషయంలో DMKతో దూరం పాటిస్తోంది. అన్ని మతాలనూ గౌరవిస్తామని తేల్చి చెబుతోంది. "ఎందుకొచ్చిన తలనొప్పి" అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. పైగా ఇప్పటికే బీజేపీ DMK పార్టీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌కీ అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫైనల్‌గా పార్టీ క్రెడిబిలిటీని డ్యామేజ్ చేస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ పార్టీ ప్రతినిధులు వరుస పెట్టి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. చాలా క్లారిటీగా తమ స్టాండ్ ఏంటో వివరిస్తున్నారు.
"మాకు అన్ని మతాలూ సమానమే. ఏ మతాన్ని కూడా చిన్నచూపు చూడాల్సిన పని లేదు. భారత రాజ్యాంగం కూడా దీన్ని ఒప్పుకోదు. అన్ని మతాలనూ సమానంగా చూడడమే కాంగ్రెస్ సిద్ధాంతం. విపక్ష కూటమిది కూడా ఇదే అభిప్రాయం"
- పవన్ ఖేడా, కాంగ్రెస్ ప్రతినిధి
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా ఈ వివాదంపై స్పందించారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తామూ నడుస్తున్నామని, అన్ని మతాలూ ఒక్కటే అని తేల్చి చెప్పారు.
"సర్వ ధర్మ సమాభవ అని అంబేడ్కర్ చెప్పారు. అంటే అన్ని మతాలూ ఒక్కటే. ఈ విషయంలో మా స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. ఏ మతాన్ని కించపరచాలని కానీ, ఒకరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ కాంగ్రెస్ ఎప్పటికీ అనుకోదు"
- నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
చీలికలు తప్పవా..?
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించారు. అతనికి ఇంకా అనుభవం లేదని, ఎలా మాట్లాడాలో తెలియదని అన్నారు. ఇలా అన్ని పార్టీలూ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాయి. వీలైనంత వరకూ ఈ వివాదం నుంచి బయట పడాలని చూస్తున్నాయి. కానీ...DMK మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వివాదం కూటమిలో చీలికలు తీసుకొస్తుందా అన్న అనుమానాలకూ తావిస్తోంది.
Also Read: భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కో ఆర్డినేటర్ శ్రింగ్లా