దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు బెయిల్ మంజూరైంది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌కు మధ్యంతర బెయిల్... ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్‌లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రౌస్‌్ అవెన్యూ కోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, ముత్త గౌతమ్, అరుణ్ పిళ్లైకు కూడా బెయిల్ ఇచ్చింది. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ గ్రాంట్ అయింది. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ జనవరి 24 వాయిదా వేసింది.
విచారణ సమయంలో ఇద్దర్నే అరెస్టు చేశామని ఐదురుగు నిందితులను అరెస్టు చేయలేదని కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చింది.
నవంబర్ 25న ఏడుగురు నిందితులను ప్రస్తావిస్తూ 10వేల పేజీలతో తొలి ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో దేశంలో రాజకీయ సంచలనంగా మారింది. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చాలా రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది లిక్కర్ వ్యాపారుల పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లను సీబీఐ ప్రస్తావించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల పేర్లు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మనిష్ సిసోడియా పేరు ప్రత్యేకంగా వినిపించింది. దేశవ్యాప్తంగా ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం ఈ కేసు మరోలా ఉంది. ఇందులో ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు రావడంతో సంచలనంగా మారింది. ఆమెను రెండుసార్లు సీబీఐ విచారించింది.