Ram Mandir Donations: దాదాపు 500 ఏళ్ల తరువాత అయోధ్యలో రామయ్య కొలువుతీరాడు. భారతదేశంతో పాటు విదేశాలలోని భక్తులు సైతం చారిత్రాత్మక ఘట్టాన్ని (Ayodhya Ram Mandir Inauguration) లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించారు. దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అభిజిత్ లగ్నం ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. జన్మభూమిలో రాముడు కొలువు దీరాలని భావించి రోజువారీ కూలీల నంచి కుబేరుల వరకు దేశ విదేశాల్లోని భక్తులు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమ వంతుగా విరాళం ప్రకటించారు. 


అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అందించారు. వి దిలీప్ కుమార్ అనే డైమండ్ బిజినెస్ మ్యాన్ కుటుంబం రామయ్యకు తన వంతుగా 101 కేజీల బంగారాన్ని విరాళం ఇచ్చారు. ఆలయంలో నిర్మించిన తలుపులకు బంగారం పూత పూయడం తెలిసిందే. అయితే మార్కెట్‌లో ఉన్న ధర ఆధారంగా చూస్తే.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ ఫ్యామిలీ రామాలయానికి దాదాపు రూ.68 కోట్లు రామ మందిరం ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలుస్తోంది. రామయ్య గుడి నిర్మాణానికి వచ్చిన భారీ విరాళం ఇదే. 


అయోధ్య రామ మందిర నిర్మాణానికి రెండో అతిపెద్ద విరాళాన్ని ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అందించారు. రామ మందిరం కోసం మొరారీ బాపు రూ. 11.3 కోట్లను అందించారు. అమెరికా, బ్రిటన్, కెనడాలోని తన అనుచరుల విరాళాల ద్వారా నిధులు 8 కోట్లు రూపాయలు జమకూర్చినట్లు సమాచారం. సూరత్ కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడే ఈ డోలాకియా. 


అప్పు చేసి మందిరానికి విరాళం..
యూపీకి చెందిన ఒక వ్యక్తి రామాలయం నిర్మాణానికి అప్పుడు చేశాడు. అయోధ్యలో రామ జన్మభూమిలో కొలువు తీరనున్నడంతో ఆ వ్యక్తి కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 16 ఎకరాల పొలాన్ని అమ్మేయగా రూ.85 లక్షలు వచ్చింది. మిగతా 15 లక్షలను అప్పుగా తీసుకొచ్చి మరీ మొత్తం రూ.1కోటి విరాళం అందించినట్లు సమాచారం.