Ramlala Pran Pratishtha: అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ప్రాణ ప్రతిష్ఠ తరవాత భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ భూమ్మీద తనకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ లేరని, ఇంకా కల్లోనే ఉన్నట్టు ఉందని అన్నాడు. గర్భ గుడిలో ప్రతిష్ఠించేందుకు మొత్తం మూడు రామ్ లల్లా విగ్రహాలను చెక్కించింది (Ram Lalla Idol) రామజన్మభూమి ట్రస్ట్. అందులో ఓటింగ్ నిర్వహించి ఓ విగ్రహాన్ని ఎంపిక చేసింది. అదే అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ఐదడుగుల విగ్రహం. పూర్తిగా కృష్ణ శిలతో దీన్ని చెక్కాడు యోగిరాజ్. 51 అంగుళాల ఈ మూర్తి ప్రస్తుతం రామ మందిర గర్భ గుడిలో స్వర్ణాభరణాలతో ధగధగా మెరిసిపోతోంది. వెండి గొడుగుతో పాటు పట్టు వస్త్రాలు, పాదుకలు సమర్పించారు ప్రధాని మోదీ. రాముల వారి నుదుటన వజ్రనామం అందరినీ కట్టి పడేస్తోంది. అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నో విగ్రహాలు చెక్కినప్పటికీ అయోధ్య రాముడి విగ్రహాన్ని చెక్కే అదృష్టం తనకే దక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు. నిజానికి ప్రాణ ప్రతిష్ఠకు ముందు రామ్ లల్లా విగ్రహ ఫొటోలు బయటకి వచ్చాయి. కానీ...ఇవాళ ప్రాత ప్రతిష్ఠ చేసిన తరవాత తెర తొలగించారు. అప్పుడే తొలి దర్శనమిచ్చాడు అయోధ్య రాముడు. సోషల్ మీడియా అంతటా ఆ ఫొటోలే కనిపిస్తున్నాయి. "వందల ఏళ్ల కల నెరవేరింది" అంటూ అందరూ షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లని చూసి ఎమోషనల్ అయ్యాడు అరుణ్ యోగి రాజ్. 


"ప్రస్తుతం ఈ భూమ్మీద అందరికన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. నా కుటుంబ సభ్యులు, ముందు తరాల వాళ్ల ఆశీస్సులతో పాటు ఆ రామయ్య ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి. నాకు ఇంకా ఇది నమ్మేలా లేదు. కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది"


- అరుణ్ యోగిరాజ్, రామ విగ్రహ శిల్పి 


గత వారమే ఈ విగ్రహాన్ని గర్భ గుడికి తరలించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున భజనలు, పూజలు చేశారు. ఇప్పుడు శాస్త్రోక్తంగా ఐదేళ్ల బాల రాముడిని పద్మాసనంపై ప్రతిష్ఠించారు. 


 500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉద్విగ్నంగా నిరీక్షించిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌లో ప్రాణ ప్రతిష్ఠ తంతుని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని మోదీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. 


 






Also Read: Ram Mandir: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం