Ram Mandir Consecration: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్యలో రాములోరి ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరి కళ్లు ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన వైపే. అయోధ్యకు చేరుకోలేని వాళ్లంతా ఇళ్లలోనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. టీవీల ముందు కూర్చుని ప్రతి క్రతువును లైవ్‌లో చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన, వీధి వీధిలో రాములవారికి, ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే టీటీడీ కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 


ప్రత్యేక రామపారాయణం.. 


అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ. బాలరాముడి విగ్రప్రతిష్‌ఠ సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు.


ఇక అయోధ్య వెళ్లి అక్కడి కార్యక్రమాలను చూడలేని వాళ్లకోసం.. ఎస్వీబీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాంట్లో భాగంగానే ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానెల్‌లో మాత్రం తిరుమలలో స్వామివారి కల్యాణం అయిన అనంతరం అంటే.. 12 గంటల తర్వాత ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని టీటీడీ ప్రకటించింది. ఎంతో వైభవోపేతంగా, ఆగమోక్తంగా జరిగే ఈ కార్యక్రమాలను టీవీ ద్వారా వీక్షించి ప్రతి ఒక్కరు ఆ రాముని కృపకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక ఇప్పటికే టీటీడీ అయోధ్యకు శ్రీవారి ప్రసాదాన్ని పంపింది. లక్ష లడ్డులను అయోధ్యకు ప్రసాదంగా పంపినట్లు టీటీడీ అధికారులు చెప్పారు.  


ఇక తిరుమలలో భక్తుల రద్దీ విషయానికి వస్తే.. రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే 77,334 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,694 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయలు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.