Ram Mandir Pran Pratishtha Ritual : అయోధ్య (Ayodhya)రామమందిరంలో శ్రీరాముడి (Srirama)విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన ప్రత్యేక క్రతువులు (Rituals) కొనసాగుతున్నాయి. నేడు గర్భగుడిలోకి బాల రాముడి(Ram Lal) విగ్రహన్ని తీసుకురానున్నారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మంగళవారం సరయు నది తీరంలో దీపోత్సవం, హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి. బుధవారం కలశ పూజ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా, ఆయన భార్య, ఇతరులు సరయు నది తీరంలో కలశ పూజ చేశారు. ఆ తర్వాత కలశాలలో సరయు నది నీటిని రామాలయానికి తీసుకెళ్లారు. గర్భగుడిలో రామ విగ్రహం ప్రతిష్ఠించే చోట కూడా పూజలు చేశారు. ఈ క్రతువుల్లో సుమారు 121 మంది పురోహితులు పాల్గొంటున్నారు. 


గర్భగుడి సమీపానికి రామ్ లల్లా విగ్రహం
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని గర్భగుడి సమీపానికి తీసుకొచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు, నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్...గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద  పూజలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ జరిగే 22 తేదీ వరకు క్రతువులు జరగనున్నాయి. అయోధ్యలోని కరసేవకపురాన్ని సందర్శించి జరుగుతున్న పనులను  ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​ పర్యవేక్షించారు. ఓ వ్యానులో విగ్రహాన్ని తరలిస్తుండగా, అక్కడ ఉన్న ప్రజలందరూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు సూర్యకుండ్​ ప్రాంతంలో రాముడి చరిత్రతో లేజర్​ షో నిర్వహించారు.


23 నుంచి భక్తులకు అనుమతి
ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానం పంపారు. 
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు...ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారు 


విగ్రహం గురించి దేశవ్యాప్తంగా చర్చ
మరోవైపు ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్​ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. విగ్రహ రూపాన్ని ఇప్పటికే ప్రముఖులకు అందించిన ఆహ్వాన పత్రికలపై ముద్రించారు. బాలుడి రూపంలో ఉన్న రాముడు, చేతిలో విల్లుతో కమలం పువ్వుపై నిల్చుని ఉన్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను పరిశీలించారు. చివరికి అరుణ్ యోగిరాజ్‌ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుంది. ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందని పొడవాటి చేతులతో విగ్రహం ఉంటుంది. రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయి.