Ram Lalla Aarti Live in Doordarshan: అయోధ్య రామమందిరంలో రోజూ ఉదయం జరిగే హారతి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు లైవ్ లో వీక్షించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రామ భక్తులు ఈ హారతిని దూరదర్శన్ ఛానెల్‌లో రోజూ లైవ్ లో చూడవచ్చు. ఈ విషయాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ఎక్స్ ద్వారా వెల్లడించింది. అయోధ్య రామ మందిరంలోని రామ్ లల్లాకు ఇచ్చే హారతి డీడీ నేషనల్ ఛానెల్‌లో రోజూ ఉదయం 6.30 గంటలకు ఉంటుందని ఎక్స్ లో చేసిన పోస్టులో దూరదర్శన్ నేషనల్ తెలిపింది.
కోట్లాది మంది రామ భక్తులకు రామ్ లల్లాను మరింత చేరువ చేసే లక్ష్యంతోనే రోజువారీ హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్లుగా దూరదర్శన్ నేషనల్ వివరించింది. డీడీ నేషనల్ శాటిలైట్ ఛానెల్ తో పాటుగా డీడీ యూట్యూబ్ ఛానెల్ లో కూడా లైవ్ ప్రసారం అవుతుందని పోస్ట్ లో వివరించారు.
అయితే, రామ్ లల్లా హారతి ప్రత్యక్ష ప్రసారం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని జాతీయ వార్తా సంస్థలు రాశాయి. కానీ, దూరదర్శన్ తమ ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బందిని అయోధ్య ఆలయ ఆవరణలో నియమించారు. వీరు ఈ ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను చూడనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 6.30 నుంచి 30 నిమిషాల పాటు రామ్ లల్లా హారతి ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే, తొలుత ‘మంగళ హారతి’ పేరుతో కొన్ని నెలల పాటు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్ ప్రసారం చేయనుండగా.. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రామ మందిర్ ట్రస్టు ముందుకు తీసుకెళ్లనుంది.
రోజుకు 6 హారతులు
అయోధ్య రామమందిరంలో కొలువై ఉన్న రామ్ లల్లాకు రోజుకు 6 సార్లు హారతి ఇవ్వనున్నారు. తెల్లవారు జామున 4.30 గంటలకు మంగళ హారతి, ఉదయం 6.30 నిమిషాలకు శ్రింగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగ హారతి ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తరప్పన్ హారతి, సాయంత్రం ఏడు గంటలకు సంధ్యా హారతి, రాత్రి 10 గంటలకు ఆఖరు సారి శాయన్ హారతి ఇస్తారు.
మంగళహారతిని నేరుగా వీక్షించాలనుకొనే భక్తులకు ఆలయంలోకి ఉదయం నాలుగు గంటలకే అనుమతించనున్నట్లుగా తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే శ్రింగార హారతి కోసం ఉదయం 6.15 గంటలకు, శాయన్ హారతికి రాత్రి 10 గంటలకు ఆలయంలోకి అనుమతి ఉంటుంది. ఈ హారతిని ప్రత్యక్షంగా చూడాలనుకునే భక్తులకు ఎలాంటి ప్రత్యేక పాస్ లు తీసుకోవాల్సిన అవసరం ఉండదని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వివరించింది.