Ayodhya Laddu Selling in Amazon: అయోధ్య ప్రసాదం పేరుతో దందా మొదలైపోయింది. అయోధ్య రామ మందిరం కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటి వరకు టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు ప్రసాదం పేరుతో మరో మోసానికి తెరతీశారు. ఏకంగా అమెజాన్‌లోనే అమ్మకానికి పెట్టారు కేటుగాళ్లు 


రాముడి కోసం వెయిటింగ్


అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి కనిపిస్తంది. కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడు రామచంద్రస్వామిని దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఆ దివ్యస్వరూపాన్ని గర్భగుడిలో చూసి తరించాలని ఆశతో ఉన్నారు. 


మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు


ఇలాంటి ఆసక్తిని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అంది వచ్చిందే మంచి అవకాశం అన్నట్టు మోసాలు చేస్తున్నారు. 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సామాన్యులెవరికీ ఆహ్వానం లేదు. అయినా సరే వీఐపీ టికెట్ల పేరుతో మెసేజ్‌లు పంపించి భారీగానే డబ్బులు పోగేశారు కేటుగాళ్లు. సైబర్ నేరాలకు పాల్పడి వేల మందిని మోసం చేశారు. 


అయోధ్య రాముడి పేరుతో ప్రసాదం


ఇప్పుడు ప్రసాదం పేరుతో మరో కొత్త దందాకు తెరతీశారు. ఏకంగా 22వ తేదీని అయోధ్య రాముడి ప్రసాదం మీ ఇంటికే పంపిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అక్కడా ఇక్కడా కాదు ఏకంగా అమెజాన్‌లోనే పెట్టేశారు. దీనికి ప్రత్యేక ఆఫర్‌లు కూడా ఇస్తున్నారు. ఐదు రకాల లడ్డూలను అమ్మకానికి పెట్టారు. దీనిపై రాయితీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 


నార్మల్‌ లడ్డూలకే అయోధ్య కోటింగ్


సాధారణ లడ్డూలను అయోధ్య లడ్డూలు అనే బ్రాండ్ వేసి అమ్ముతున్న మోసాన్ని కొందరు గుర్తించారు. ఇది కాస్త వైరల్ కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్ సంస్థ అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల లోపు సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది.