Sanatana Dharma Row: 


సనాతన ధర్మం వివాదం..


సనాతన ధర్మ  వివాదాన్ని ఇక పక్కన పెట్టేయాలని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు DMK చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. బీజేపీ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సనాతన ధర్మం వివాదం వైపు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు సనాతన ధర్మం అంశాన్నే హైలైట్ చేయాలని సూచించారని, తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ వివాదాన్ని వాడుకుంటున్నారని చెప్పారు స్టాలిన్. బీజేపీ ట్రాప్‌లో పడి ఈ వివాదాన్ని కొనసాగించొద్దని సూచించారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రులతో ఈ మధ్యే భేటీ అయ్యారు. సనాతన ధర్మం వివాదంపై స్పందించాలని అందరికీ చెప్పారు. ఆ విధంగా పొలిటికల్ మైలేజ్‌ కోసం చూస్తున్నారు. ఓ కేంద్రమంత్రి పదేపదే ఈ వివాదంపై స్పందిస్తూ అసలు సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టిస్తున్నారు. ఇదంతా డైవర్ట్ చేసే రాజకీయమే. ఈ ట్రాప్‌లో మనం పొరపాటున కూడా చిక్కుకోవద్దు. అవినీతి గురించి మాట్లాడకుండా పూర్తిగా ఈ వివాదంపైనే ఫోకస్ పెడుతున్నారు. బీజేపీ అవినీతి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. కాంగ్రెస్‌ సహా వామపక్ష పార్టీలన్నీ ఇదే విధంగా ఉండాలి"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


బీజేపీ అంతా అవినీతిమయం..


దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు స్టాలిన్. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీపై పోరాడాలని చెప్పారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌ని పట్టించుకోవద్దని సూచించారు. భారత్ మాల, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్ట్‌కైన ఖర్చుల్లో అవకతవకలు జరిగినట్టు కాగ్ రిపోర్ట్ వెల్లడించిందని చెప్పారు. మణిపూర్‌లో హింసను అణిచివేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమికి చెందిన నేతలు విజయం సాధించారని, 2024లోనూ ఇదే రిపీట్ అవుతుందని అన్నారు. 


వెనక్కి తగ్గని ఉదయనిధి..


ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను పోస్టు చేశారు. ఈ వివాదం నడుస్తున్న వేళ ఆయన అలాంటి ఫోటోను పోస్టు చేయడం చూస్తుంటే.. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు అనే సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని గతంలో డెంగ్యూ, మలేరియా, దోమలు లాంటి వాటితో పోలుస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ (X) లో మస్కిటో కాయిల్ ఫోటోను పోస్టు చేశారు ఉదయనిధి స్టాలిన్. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. దీంతో పరోక్షంగా మరోసారి వివాదాన్ని పెంచుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలను వ్యాపింపజేసే దోమలను తరిమికొట్టడానికి మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. ఆయన ఆ ఫోటో పెట్టడాన్ని చూస్తుంటే.. మరోసారి అవే వ్యాఖ్యలను పరోక్షంగా చేసినట్లు అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.