Man Suicide: 


నాగ్‌పూర్‌లో ఘటన..


అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఆత్మహత్య చేసుకునేందుకు ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మనీష్ అలియాస్ రాజ్ యాదవ్ కన్హన్ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కలమన ఏరియాలో ఉంటున్న మనీష్...అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. ఆమెని మనీష్ కిడ్నాప్ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మనస్తాపానికి గురైన మనీష్..నదీ తీరానికి వెళ్లి కూర్చున్నాడు. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. యువతి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని చెప్పాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతామని బెదిరించారని అన్నాడు. అంతకు ముందు యూపీలోని ఓ వ్యక్తిని కూడా ఇలాగే బెదిరించారని లైవ్‌లోనే మాట్లాడాడు. వాళ్ల వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి అక్కడి నుంచి వెళ్లి నదిలో దూకాడు. ఇదంతా లైవ్‌లో ఉండగానే చేశాడు. ఆ యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.