Telangana High Court: స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్ల పని తీరుపై పోలీసులు జోక్యం చేసుకోలేరని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అక్కడ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా, పారదర్శకంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తే... పోలీసులు స్పా సెంటర్ల పని తీరు గురించి ప్రశ్నించలేరని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో స్పా సెంటర్‌కు చెందిన మూడు శాఖలు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతించాలని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఆదేశించారు. బంజారా హిల్స్‌లోని ది సెంట్ హోటల్, లక్డీకాపూల్, లోటస్ పాండ్, సోమాజి గూడలోని గాయత్రి బిల్డింగ్‌లో మూడు శాఖలను కలిగి ఉన్న సోమారా వెల్‌నెస్ స్పా డైరెక్టర్ సౌరభ్ కుమార్ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
"స్పా సెంటర్లు సక్రమంగా నిర్వహిస్తూన్నా కేంద్రాలను మూసివేస్తున్నారు"
తమ స్పా సెంటర్ల రోజువారీ నిర్వహణలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, కేంద్రాలను మూసివేయాలని పిటిషనర్ కోరారు. అలాగే పోలీసులు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించడం లేదని తరచుగా తమ కేంద్రాలను మూసివేస్తున్నారని అన్నారు. 2021 సెప్టెంబర్ 28వ తేదీన జారీ చేసిన ఆర్డర్‌లో.. స్పా, మసాజ్ సెంటర్ల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను హైకోర్టు నిర్దేశించినప్పటికీ... ఇది జరుగుతోందని చెప్పారు. సోమరా స్పా దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తూ.. జస్టిస్ భాస్కర్ రెడ్డి 2021 ఆర్డర్‌కు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కోర్టు 103 స్పా సెంటర్ల ఫిర్యాదులను విచారించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మసాజ్ సేవను పొందిన కస్టమర్ల రికార్డును నిర్వహించడం వంటి కొన్ని మార్గదర్శకాలు అందులో ఉన్నాయి.
"మసాజ్ సెంటర్ల రికార్డులను ఎస్ఐ ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి"
ఆపోజిట్ జెండర్ నుంచి మసాజ్ సేవ కోరిన కస్టమర్ల సంప్రదింపు వివరాలు, ఎవరు అలాంటి సేవను కోరుతున్నారో తెలుసుకోవడానికి పోలీసులకు వీలు కల్పిస్తుంది. ఈ నిర్థారణ పనిని ఎస్‌ఐ చేయాలి. ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా క్రాస్ మసాజ్ సర్వీస్ ప్రొఫెషనల్ పద్ధతిలో చేయాలి. స్పా పని వేళల్లో స్పా సెంటర్ మెయిన్ డోర్ తెరిచి ఉంచాలి. ఈ మసాజ్ సెంటర్లు నిర్వహించే రికార్డులను కూడా ఎస్‌ఐ ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. ఈ మసాజ్ సెంటర్ల నిర్వాహకులు ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడినా లేదా నేరాలు చేసిననా పోలీసులు దర్యాప్తు చేయవచ్చు.