Asaduddin Owaisi:
రాహుల్‌కి కౌంటర్..
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎమ్ఐఎమ్ పార్టీ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రత్యర్థులను నిలబెడుతుందని ఆరోపించారు రాహుల్. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ వీళ్ల మధ్య ఇలా డీల్ కుదురుతుందని మండి పడ్డారు. ఈ ఆరోపణలపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. కేవలం తాను ముస్లిం అనే కారణంగానే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
"నా పేరు అసదుద్దీన్. నాకు గడ్డం ఉందని, నా తలపై టోపీ ఉందనే కదా రాహుల్ గాంధీ ఇలా ఆరోపణలు చేస్తున్నారు. నేను బీజేపీ నుంచి డబ్బులు తీసుకుంటానని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యల్ని బట్టే అర్థమవుతోంది. మేమంటే మీకెంత ద్వేషమో. ఇలా గడ్డం పెంచుకుని టోపీ పెట్టుకునే వాళ్లందరిపైనా మీరు ఇలాంటి ఆరోపణలే చేస్తారేమో"
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్
రాహుల్ ఏమన్నారంటే..
ఇటీవల తెలంగాణలోని కల్వకుర్తిలో రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అటు అసదుద్దీన్ ఒవైసీపైనా ఆరోపణలు చేశారు.
"అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, త్రిపుర...ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే MIM పార్టీ సిద్ధంగా ఉంటుంది. బీజేపీతో మేం పోటీ పడే ప్రతి చోటా ప్రత్యర్థులను నిలబెడుతుంది. ఇందుకోసం బీజేపీ నుంచి భారీ ఎత్తున డబ్బు తీసుకుంటుంది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
మీరెంత తీసుకున్నారు..?
అటు అసదుద్దీన్ ఒవైసీ రాహుల్‌కి కౌంటర్‌లపై కౌంటర్‌లు ఇచ్చారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చదివి వెళ్లిపోతారంటూ ఎద్దేవా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠి నియోజకవర్గంలో ఓడిపోయేందుకు కాంగ్రెస్ ఎంత డబ్బు తీసుకుందో లెక్క చెప్పాలని ప్రశ్నించారు.
"2014,2019లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందుకోసం మీరెంత డబ్బు తీసుకున్నారో చెప్పండి. మీ ఫ్రెండ్ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. ఆయన అందుకోసం డబ్బు తీసుకున్నారని మీరెప్పుడూ చెప్పలేదెందుకు..? మరో ఫ్రెండ్ జితిన్ ప్రసాద కూడా బీజేలో చేరారు. ఆయన ఎంత తీసుకున్నారో అడిగారా.."
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై..
ఇటీవలే ఒవైసీ ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధంపై (Israel Hamas War) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుని డెవిల్ అని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గాజా ప్రజల పట్ల సానుభూతి చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పాలస్తీనా పౌరులపై జరుగుతున్న ఈ దాడులను ఖండించాలని స్పష్టం చేశారు. దీన్ని కేవలం ముస్లింల సమస్యగా చూడొద్దని, మానవతా కోణంలో ఆలోచించి అందరూ మద్దతుగా నిలవాలని సూచించారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడు అని, నియంత అని తీవ్రంగా మండి పడ్డారు. ప్రధాని మోదీ దృష్టి సారించి పాలస్తీనాకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.
Also Read: Delhi Pollution: పొల్యూషన్‌ని కంట్రోల్ చేసేందుకు 5 అస్త్రాలు, ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివే