Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో పిళ్ళై నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. గత మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.


ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపులోని పలువురు సభ్యులు అప్రూవర్‌గా మారారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై కంటే ముందుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్స్‌గా మారిన వారిలో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఇటీవల అప్రూవర్‌గా మారిన మాగుంట
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల వ్యక్తుల నుంచి ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు భావిస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 


ఢిల్లీ మద్యం కేసులో తొలుత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారగా, ఆయన తర్వాత మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై బయట ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు. అప్రూవర్‌గా మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడు పెంచింది. పలువురు కీలక వ్యక్తులను విచారించింది. ఈడీ విచారణలో మాగుంట కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 


ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూపు‌నకు చెందిన వారే ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంట శ్రీనివాసులురెడ్డి కావడం, అప్రూవర్‌గా మారిన ఆయన ఈడీకి ఏ సమాచారం ఇచ్చారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని ఈడీ ప్రశ్నించింది. ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల మరోసారి ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరికొందరిని ఈడీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.