Manipur Violence: 


సామూహిక అత్యాచారం


మణిపూర్‌ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ మహిళలపై ఎంత దారుణమైన దాడులు జరుగుతున్నాయో ఆ వీడియోతో ప్రపంచానికి తెలిసింది. కానీ...ఇప్పటికీ వెలుగులోకి రాని దారుణాలు చాలానే ఉన్నాయి. ఎంతో మంది అత్యాచార  బాధితులు ఇప్పుడిప్పుడే తమ ఆవేదనను బయటకు చెబుతున్నారు. న్యాయం జరుగుతుందన్న ఆశతో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ 37 ఏళ్ల బాధితురాలు తన బాధనంతా బయటపెట్టింది. చురచందపూర్‌లో ఓ వర్గం వాళ్లు వచ్చి ఇళ్లన్నీ తగలబెడుతుంటే కుటుంబంతో సహా పారిపోవాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇద్దరు కొడుకులు, మేన కోడలితో బయటకు వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు వచ్చి ఆమెను అడ్డగించారు. బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. మే 3వ తేదీన ఈ దారుణం జరిగినా...ఇన్నాళ్లూ నోరి విప్పలేదని చెప్పింది. పోలీసుల వరకూ వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం ఇన్నాళ్లూ లేదని, ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకుని కంప్లెయింట్ ఇచ్చినట్టు వివరించింది. 


"నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోడానికి ఇన్నాళ్లూ నోరి విప్పలేదు. దీని గురించి మాట్లాడాలంటేనే నాకు భయమేసింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది"


- బాధితురాలు


కేసు నమోదు 


బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో FIR నమోదు చేశారు. ప్రస్తుతానికి ఓ రిలీఫ్ క్యాంప్‌లో తల దాచుకుంటోంది. పోలీసుల FIR ప్రకారం...మే 3వ తేదీన సాయంత్రం 6.30 నిముషాలకు ఈ ఘటన జరిగింది. 


"నా మేనకోడలిని చీరతో వెనక్కి కట్టుకున్నాను. ఇద్దరి కొడుకులనూ జాగ్రత్తగా బయటకు పంపాను. అక్కడి నుంచి పరిగెత్తాం. ఉన్నట్టుండి నేను కింద పడిపోయాను. నా మేనకోడలు వచ్చి నన్ను లేపింది. సరిగ్గా అదే సమయానికి ఆరుగురు వ్యక్తులు వచ్చారు. నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్టు తిట్టారు. నేలకేసి కొట్టారు. లైంగికంగా వేధించారు. నేను ఏ తప్పూ చేయకపోయినా ఈ దారుణానికి బలి కావాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి"


- బాధితురాలు 


3 నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దర్యాప్తు, పరిష్కార చర్యలు, పరిహారం, పునరావాసాన్ని పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తుల కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన 11 ఎఫ్ఐఆర్‌లపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబయి మాజీ పోలీసు కమిషనర్ దత్తాత్రయ్ పద్‌సాల్గికర్‌ను సుప్రీం కోర్టు నియమించింది. మే నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుతో సహా మణిపూర్ హింసాకాండకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్యానెల్ లో జస్టిస్ గీతా మిట్టల్ (జమ్మూ & కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలినీ ఫన్సాలార్ జోషి (బాంబే హెచ్సీ మాజీ న్యాయమూర్తి), జస్టిస్ ఆశా మీనన్ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) లు ఈ ప్యానెల్ ఉంటారు. ఈ ప్యానెల్ కు జస్టిస్ గీత మిట్టల్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. 


Also Read: Rice Price Hike: మండిపోతున్న బియ్యం ధరలు, గత 15 ఏళ్లలో ఎన్నడూ ఇంత రేటు వినలేదు