Cheetah Dies In Madhya Pradesh's Kuno National Park: దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే చిరుత మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఎంపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఉదయ్ అనే మగ చిరుత ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అంత చురుకుగా కనిపించలేదని, అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. వెటర్నరీ డాక్టర్లు, చిరుత సంరక్షణ నిపుణులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో చిరుత ఉదయ్ చనిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు.


దక్షిణాఫ్రికాలోని వాటర్‌బర్గ్ బయోస్పియర్ నుంచి దక్ష, నిర్వా, వాయు, అగ్ని, గామిని, తేజస్, వీర, సూరజ్, ధీర, ప్రభాస్, పావక్ అనే  11 చిరుతలతో పాటు ఉదయ్‌ అని మగ చిరుతను భారత్ కు తీసుకొచ్చారు. దేశంలో ఎప్పుడో అంతరించిన చిరుతలను మళ్లీ సంరక్షించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. 






దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన 12 చిరుతలలో 7 మగ చిరుతలు ఉన్నాయి. అందులో మగ చిరుత ఉదయ్ కూడా ఉంది. అయితే వాటర్ బర్గ్ బయో స్పియర్ నుంచి తీసుకొచ్చిన చిరుతలలో చనిపోయిన రెండో చిరుత ఉదయ్. మార్చి నెలలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో షాషా అనే ఆడ చనిపోవడం తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్ సమస్యల కారణంగా ఆడ చిరుత షాషా మృతి చెందింది. తాజాగా చనిపోయిన ఉదయ్ అనే చిరుత మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత వెల్లడిస్తామని కునో నేషనల్ పార్క్ లోని సంరక్షకుడు చెబుతున్నారు. 


తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17, 2022న , మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ కు 8 చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. నమీబియా నుంచి మొత్తం 8 చిరుతలను భారత్ కు తీసుకురాగా, అందులో 3 ఆడ చిరుతలు ఉన్నాయి. వీటన్నింటిని కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు.  తొలి దశలో తీసుకొచ్చిన వాటిలో షాషా అనే ఆడ చిరుత ఈ మార్చి నెలలో చనిపోయింది. 


కాగా, నమీబియా నుండి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు తరలించిన చిరుతలలో ఒకటైన 'సియాయా' మార్చి 29న నాలుగు ఆరోగ్యవంతమైన చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  'ప్రాజెక్ట్ చిరుత'లో భాగంగా చిరుతలను దేశానికి తీసుకొచ్చారు. కాగా, దేశంలోని చివరి చిరుత 1947లో ఛత్తీస్ గఢ్ లోని కొరియా ఏరియాలో చనిపోయింది. చిరుతలు దేశంలో అంతరించిపోయాయని 1952లో అధికారికంగా ప్రకటించారు.