ఢిల్లీ లిక్కర్ పాలసీ వివాదంపై సామాజిక ఉద్యమకారులు అన్నాహజారే స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రివాల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్‌పాలసీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  


2012లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో తనతోపాటు నడిచిన కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో హజారే కీలక కామెంట్స్ చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి బయటపడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీల మార్గాన్నే అనుసరించడం ప్రారంభించిందని ఆక్షేపించారు. 


"10 సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2012న అన్నా టీమ్ సభ్యులందరూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించాలన్న అంశంపై చర్చ జరిగింది. కానీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఉద్యమ లక్ష్యం కాదని అప్పుడు అనుకున్నది మీరు మర్చిపోయారు.  ఆ సమయంలో అన్నా టీమ్‌పై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది.' అని లేఖలో పేర్కొన్నారు.






అన్నా టీమ్ దేశవ్యాప్తంగా పర్యటించింది... ప్రభుత్వ విద్య కోసం పని చేయాల్సిన అవసరంపై ప్రచారం చేసింది. అలాంటి విద్యరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చేసి ఉంటే.. దేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు లిక్కర్ పాలసీ ఏర్పడి ఉండేది కాదు. ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో పని చేయించడానికి ఓ గ్రూప్‌ అవసరం ఉంది. భావసారూప్యత కలిగిన వ్యక్తుల సమూహమై ఉండాలని అన్నాహజారే అన్నారు. 


అలాంటిది జరిగి ఉంటే ఈ రోజు దేశంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. పేద ప్రజలు ప్రయోజనం పొందేవారు. కానీ దురదృష్టవశాత్తు ఇది జరగలేదు. ఆ తర్వాత ఆప్, మనీష్ సిసోడియా, మీ ఇతర సహచరులు కలిసి పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీని చూసిన తర్వాత చారిత్రాత్మక ఉద్యమంలో ఓడిపోయారనిపిస్తోంది. ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ కూడా ఇతర పార్టీల బాటలోనే పయనిస్తున్నట్టుగానే ఉంది. ఇది చాలా బాధాకరం' అని లేఖలో రాశారు.


మద్యం మత్తు ఎలా ఉంటుందో, అదే విధంగా అధికార మత్తు కూడా ఉంది. నువ్వు కూడా అలాంటి అధికారం మత్తులో మునిగిపోయావు అని సీరియస్ కామెంట్స్ చేశారు. 


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చెందిన ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లాకర్‌ను సీబీఐ మంగళవారం తనిఖీ చేసింది.