Viral News: 6E2142 నంబర్ గల ఇండిగో విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ బయల్దేరింది. అక్కడకు చేరుకునే సరికి కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ల్యాండింగ్ టైంలో కురిసిన వర్షానికి దెబ్బతింది. ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం ముందు భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షింతగా బయటపడ్డారు.  

శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం గాలిలోనే ఉన్నప్పుడు వాతావరణ సడెన్‌గా మారింది. పరిస్థితి ముందే గమనించిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.  

6E2142 నంబర్ గల విమానం శ్రీనగర్‌కు చేరుకుంటుండగా వడగళ్ల వాన పడింది. ఈ ఘటన వల్ల విమానం ముందు భాగం దెబ్బతింది. చివరకు సాయంత్రం 6.30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాన్ని సిబ్బంది సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు.

వడగళ్ల వాన పడుతున్న టైంలో విమానంలో ఉన్న ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. లోపల జరిగే హైడ్రామాను ఓ ప్రయాణికుడు చిత్రీకరించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. వడగళ్ల రాళ్ళు కంటిన్యూగా ఫ్యూజ్‌లేజ్‌ను తాకడం, క్యాబిన్ షేక్ అవ్వడం కనిపించింది. బయట వాతావరణంలో మార్పుల వల్ల విమానంలో ఉన్న  ప్రయాణికులు కేకలు పెడుతూ భయాందోళనల్లో ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.  

విమానం దిగిన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చారు. విమానం "ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్" (AOG) అని ప్రకటించేంత నష్టం వాటిల్లింది, అత్యవసర మరమ్మతుల కోసం దానిని నిలిపివేశారు.  

"ఢిల్లీకి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం 6E2142 వడగళ్ల తుపాను కారణంగా సమస్య ఎదుర్కొంది. పైలట్ ATC SXR (శ్రీనగర్)కి అత్యవసర పరిస్థితి గురించి సమాచారం అందించారు. " అని భారత విమానాశ్రయ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు.

"విమాన సిబ్బంది, 227 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానాన్ని ఎయిర్‌లైన్ AOGగా ప్రకటించింది" అని అధికారి ప్రకటించారు.  

ఈ ఘటనకు సంబంధించి ఇండిగో కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానం శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది.

"ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు నడుస్తున్న ఇండిగో విమానం 6E 2142 మార్గమధ్యంలో ఆకస్మిక వడగళ్ల వాన ప్రభావానికి గురైంది. విమానం, క్యాబిన్ సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించారు. విమానం శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికుల శ్రేయస్సు,  సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. అవసరమైన తనిఖీలు పూర్తి అయిన తర్వాత విమానం విడుదల చేస్తారు " అని ప్రకటనలో పేర్కొంది.

బుధవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసింది, దీనితో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, హర్యానాతోపాటు పరిసర ప్రాంతాలపై పంజాబ్ నుంచి బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణిలో ఏర్పడిన తుపాను ప్రభావం ఉంది.  

ఊహించని వాతావరణ అంతరాయం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో అనేక దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయడం లేదా దారి మళ్లించారు.