Amit Shah To Stalin: 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం (జూన్ 8, 2025) తమిళనాడులోని మధురైలో కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ.. తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేను, ప్రధాని మోదీ డీఎంకేను ఓడించలేమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పిన మాటలు నిజమేనని, ఎందుకంటే వారిని ఓడించేది ఓట్లు వేసే ప్రజలేనని ఎద్దేవా చేశారు.  2021లో డిఎంకె ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చారా అని సీఎం స్టాలిన్‌ను అమిత్ షా ప్రశ్నించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మధురైని మార్పుల నగరంగా అభివర్ణించారు. బిజెపి కార్యకర్తల సమావేశం ఎన్నో మార్పులు తెస్తుందని, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)ను తమిళనాడులో అధికారం నుంచి దింపుతుందని అన్నారు. రూ.4,600 కోట్ల ఇసుక తవ్వకాల కుంభకోణం సహా రాష్ట్రంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. డీఎంకే అవినీతి పాలనలో తమిళనాడులోని పేదలు, మహిళలు, పిల్లలు ప్రభావితమయ్యారని అమిత్ షా  అన్నారు. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని అధికారం నుండి గద్దె దించడానికి ప్రతిజ్ఞ చేయాలని బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

నాకు ప్రజల నాడి తెలుసు - అమిత్ షా

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌పై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. "రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వాన్ని తాను గద్దె దింపలేనని సీఎం స్టాలిన్ అంటున్నారు. ఓ విధంగా ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే తమిళనాడు ఓటర్లు డిఎంకెను ఓడిస్తారు. నాకు ప్రజల నాడి తెలుసు. వారు రాష్ట్రంలోని డీఎంకే అవినీతి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ డీఎంకే ప్రభుత్వాన్ని కూలదోస్తారు."

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అన్నాడిఎంకె (AIADMK) కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అమిత్ షా జోస్యం చెప్పారు. డిఎంకె ప్రభుత్వం హామీల అమలు, పాలనలో 100 శాతం విఫలమైంది. 2026లో తమిళనాడుతో పాటు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు.

అమిత్ షా బిజెపి కార్యకర్తలతో సమావేశం

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు అమిత్ షా తమిళనాడులోని బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో డీఎంకే పాలన, అవినీతిపై అమిత్ షాకు కొన్ని విషయాలు వారు తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి ఆయన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.

రెండవ సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా అమిత్ షా

ఏప్రిల్‌లో తమిళనాడులో పర్యటించిన సందర్భంగా అన్నాడిఎంకెతో తాము పొత్తులో ఉంటామని అమిత్ షా ప్రకటించారు. తన ప్రసంగంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శాంతి భద్రతల విషయంలో డిఎంకె పాలనను విమర్శించారు. పశ్చిమ కొంగు ప్రాంతంలోని గ్రామాల్లో వృద్ధుల హత్యలపై పోలీసులపై, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమిత్ షాను 'భారతదేశపు ఉక్కు మనిషి, రెండవ సర్దార్ వల్లభాయ్ పటేల్' అని నాగేంద్రన్ అభివర్ణించారు. కార్యకర్తలను దృఢ సంకల్పంతో పని చేయాలని అమిత్ షా కోరారు. ఎఐఎడిఎంకెతో పొత్తును 'సరియైన కూటమి' అని ఆయన పేర్కొన్నారు.  

తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో డీఎంకేను గద్దె దింపడమే తమ లక్ష్యమని, ఈ సంకల్పంతో బీజేపీ, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు.