BJP Govt Name Changes: దేశంలో ప్రస్తుతం పేర్ల మార్పుపై చర్చ జరుగుతోంది. ఏకంగా దేశం పేరునే మారుస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. దేశం పేరును భారత్, ఇండియా అని రాస్తుండగా.. ఇకపై ఇంగ్లీష్ లోనూ ఇండియా అనే పేరును తొలగించి భారత్ పెట్టనున్నారని ఊహగానాలు వస్తున్నాయి. జీ20 సదస్సు ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం, దానిని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎత్తిచూపి విమర్శలు గుప్పించడంతో వివాదం మొదలైంది.
మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లోనే దేశం పేరును మార్చే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ల మార్పు అనేది కొత్తేం కాదు. 2014లో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎన్నో నగరాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మారాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లోనే ఏకంగా 40కి పైగా పేర్లను మార్చారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాలు, నగరాలు, వివిధ స్మారక నిర్మాణాలు, మైదానాలు, రోడ్ల పేర్లను మార్చడం మొదలు పెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేర్ల మార్పు ఎక్కువగా జరుగుతోంది. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 40కి పైగా ఊర్ల పేర్లు, విశ్వవిద్యాలయాలు, చారిత్రక ప్రదేశాల పేర్లను మార్చారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే నగరాలు, ఊర్లు, వర్సిటీలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
పేరు మార్పు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం. యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవి చేపట్టిన తర్వాత అలహాబాద్ పేరును మార్చేశారు. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ గా మార్చారు. అలాగే హర్యానాలోని గుర్గావ్ పట్టణాన్ని గురుగ్రామ్ గా మార్చారు. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా పేరు మార్చారు. మొఘల్ గార్డెన్ ను - అమృత్ ఉద్యాన్ గా, రాజ్‌పథ్ ను కర్తవ్యపథ్‌గా మార్చారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు. మొఘల్ సరాజ్ జంక్షన్ పేరును దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్ గా పేరు మార్చారు. అలాగే లక్నో పేరును లక్ష్మణ నగరిగా, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని కూడా బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.
పేర్లు మారిన నగరాలు, ప్రాంతాలు
- అలహాబాద్ - ప్రయాగ్‌రాజ్
- గుర్గావ్ - గురుగ్రామ్
- ఫైజాబాద్ - అయోధ్య
- మొఘల్ గార్డెన్ - అమృత్ ఉద్యాన్
- రాజ్‌పథ్ - కర్తవ్యపథ్
- ఫిరోజ్ షా కోట్లా స్టేడియం - అరుణ్ జైట్లీ స్టేడియం
- మొఘల్ సరాయ్ జంక్షన్ - దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్
- నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ - ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ
- నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ - కవయిత్రి బహినాబాయి చౌదరి నార్త్ మహారాష్ట్ర వర్సిటీ
- చింద్వారా యూనివర్సిటీ - రాజా శంకర్ షా యూనివర్సిటీ
- అలహాబాద్ స్టేట్ యూనివర్సిటీ - రాజేంద్ర సింగ్ (రజ్జు భయ్యా) యూనివర్సిటీ
ఢిల్లీలోని రోడ్ల పేర్లను కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తుగ్లక్ రోడ్డును గురుగోవింద్ సింగ్ గా పేరు మార్చాలని, బాబర్ లేన్ కు ఖుదీరామ్ బోస్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది.