General Elections 2024: పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections)సమీపిస్తున్న వేళ...పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాక ఇబ్బందులు పడకుండా నేతలు ముందుగానే పొత్తుల వ్యవహారాన్ని తేల్చుకుంటున్నారు.  ఎవరికి ఎన్ని సీట్ల అన్న విషయాలపై అంగీకారానికి వచ్చేస్తున్నారు. ఏయే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పొత్తు పొడిచింది. సమాజ్ వాదీ పార్టీ (Samaj Wadi Party), రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (Rastriya Lok Dal)లు ఒక అవగాహనకు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమ దోస్తీ కొనసాగుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav), ఆర్ఎల్డీ ఛీప్ జయంత్ ఛౌదురీ (Jayanth Chowdhary) అధికారికంగా ప్రకటించారు. పొత్తులపై ఇద్దరు నేతలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. విజయం కోసం మనమందరం ఏకమవుదామని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు.  జాతీయ, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని జయంత్ ఛౌదరి వెల్లడించారు. అఖిలేష్ యాదవ్ పోస్టును రీట్వీట్ చేశారు. 


జాట్ వర్గమే ఆర్ఎల్డీకి ప్రధాన ఓటు బ్యాంక్
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్నాయి. పశ్చిమ యూపీలోని ఏడు స్థానాల్లో ఆర్ఎల్డీ పార్టీ పోటీ చేస్తుందని, సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరినట్లు రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేతలు వెల్లడించారు. ఆర్ఎల్డీకి జాట్ సామాజిక వర్గమే ప్రధాన ఓటు బ్యాంక్ గా ఉంది. బిజ్నౌర్, మథుర, ముజఫర్‌నగర్, అమ్రోహా, మేరఠ్‌, బాగ్‌పత్, కైరానాలు జాట్ వర్గం జనాభా ఉన్న ఎక్కువగా ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఆర్ఎల్డీ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆధిపత్యం చాటుకుంటోంది. జయంత్ చౌధరి పార్టీ పోటీ చేసే స్థానాలు కూడా ఇవే ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.


గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ
2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఎస్పీ 111, ఆర్‌ఎల్‌డీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎస్పీ-బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కలిసి పోటీ చేశాయి. మథుర, బాగ్‌పత్‌, ముజఫర్‌నగర్ స్థానాల్లో పోటీ చేసిన ఆర్ఎల్డీ...ఒక్క చోట కూడా గెలుపొందలేకపోయింది. బహుజన్ సమాజ్ పార్టీకి 10 సీట్లు, ఎస్పీ ఐదు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. 


ఒంటరిగానే పోటీ చేస్తామన్న మయావతి
తుదిశ్వాస విడిచే వరకు రాజకీయాల్లో కొనసాగుతానని మాయావతి స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాతే పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గతంలో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయడంతో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైందన్న మాయావతి, పొత్తులతో పార్టీకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అవుతున్నా...అటు వైపు ఓట్లు బీఎస్పీకి పడటం లేదన్నారు.