Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్‌ (India)కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి పోటీ (Miss World Pageant)లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ ద్వారా ఇండియాలో 71వ పోటీలను నిర్వహిస్తున్నట్లు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈఓ జూలియా మోర్లే ప్రకటించారు. మిస్‌ వరల్డ్‌ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న ఆమె.... అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వాలని భారతీయులకు పిలుపునిచ్చారు. భారత్‌లోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయ, ఇవన్నీ ఈ ఈవెంట్‌ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు మోర్లే తెలిపారు.


ఢిల్లీ, ముంబై వేదికలుగా ప్రపంచ సుందరి పోటీలు
 1996లో బెంగళూరులో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా వేదికయింది. ప్రపంచ సుందరి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్‌  మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి  పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.


1951లో తొలిసారి అందాల పోటీలు
అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పును తీసుకురావడం, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం మిస్ వరల్డ్ పోటీల ప్రధాన ఉద్దేశం. సంప్రదాయ అందాల పోటీలకు అతీతంగా మిస్‌ వరల్డ్‌ పోటీలను 1951లో తొలిసారి నిర్వహించారు. అయితే 15 ఏళ్ల తర్వాత భారత్ కు చెందిన రీటా ఫారియా తొలిసారి విజేతగా నిలిచారు. 1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అంటే... 1994లో ఐశ్వర్యరాయ్‌ విజేతగా నిలిచారు. 1997లో డయానా హేడెన్‌, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరిటాన్ని ధరించారు. 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య నలుగురు భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. చివరి 2017లో మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌గా ఎంపికయ్యారు. గతేడాది జరిగిన పోటీల్లో పొలండ్ కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు.