Indian Air Force In Operation Sindoor | న్యూఢిల్లి: ఆపరేషన్ సిందూర్ గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడులకు సంబంధించిన మరిన్ని విజువల్స్‌ను ఐఏఎఫ్ విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ లో వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ (Air Marshal Narmdeshwar Tiwari) పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత వైమానిక దళం (IAF)కు రెండు కీలక లక్ష్యాలు కేటాయించారని తెలిపారు. 

ఐఏఎఫ్‌కు ఇచ్చిన టార్గెట్స్‌లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న మురిద్కే (లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం)తో పాటు పాకిస్తాన్ లోపల 100 కి.మీ దూరంలోని  బహావల్పూర్ (జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం) ఉన్నాయని ఎయిర్ మార్షల్ తివారీ తెలిపారు. నియంత్రణ రేఖ (LOC)కు సమీపంలో ఉన్న మిగతా 7 ఏడు ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యానికి టార్గెట్ ఇచ్చినట్లు కీలక విషయాలు వెల్లడించారు. 

ఐఏఎఫ్ నాశనం చేసిన ఉగ్రవాద శిబిరాలు ఇవే..

మురిద్కేలో బాంబులు తయారీ, ఇతర బ్లాకులు,  నిర్మాణాలను ఐఏఎఫ్ ధ్వంసం చేసిందని ఎయిర్ మార్షల్ తివారీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాదాపు 50 వరకు ఆయుధాలను ప్రయోగించారు. ఈ ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన ఐఏఎఫ్ చేసిన దాడుల్లో పాక్ లోని ఉగ్ర స్థావరాలు ఎంతగా ధ్వంసమయ్యాయో ఆయన డ్రోన్ విజువల్స్, ఫుటేజ్ ప్రదర్శించారు. ఐఏఎఫ్ దాడుల్లో రెండు ఉగ్రవాద స్థావరాలు, ఆ ప్రాంతంలో భారీ నిర్మాణ నష్టాలు జరిగినట్లు ధృవీకరించారు. బహవల్పూర్ వద్ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లీడర్స్ క్వార్టర్‌, కేడర్ హౌసింగ్ సహా 5 లక్ష్యాలను టార్గెట్ చేసి దాడులు చేసినట్లు తెలిపారు. దాడులకు సంబంధించిన విజువల్స్ ప్రదర్శించారు. 

ఉగ్రదాడి జరిగిన వెంటనే అప్రమత్తం..

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ విదేశీయుడు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత త్రివిధ దళాలు ఎదురుదాడికి సిద్ధమైంది. ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్లాన్ చేసి దాడులు చేసినట్లు తివారీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ లో మేం చేసింది మా సామర్థ్యంలో చిన్న భాగం మాత్రమే అన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఎయిర్ మార్షల్ ఓ కార్యక్రమంలో మాట్లాడటం ఇదే మొదటిసారి.

ఉగ్రవాద శిబిరాల టార్గెట్ లిస్ట్ రెడీ

ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత త్రివిధ దళాలు అప్రమత్తం అయ్యాయి. తమ ప్రధాన కార్యాలయాలలో వేర్వేరు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాయి. తాము చేపట్టే ఆపరేషన్ కు సంబంధించిన లక్ష్యాల వివరాలను ఏప్రిల్ 24న ఉన్నతస్థాయి టీంకు అందించినట్లు తివారీ పేర్కొన్నారు. ఆ బృందం, దాడి చేయడానికి ఎంచుకున్న ప్రదేశాలను త్రివిధ దళాల విభాగాధిపతులకు సమర్పించింది.  ఏప్రిల్ 29న దాడులకు సంబంధించిన లక్ష్యాలను ఖచ్చితంగా నిర్ణయించి, తుది ఆమోదం కోసం చూశామన్నారు. 

"మేం టార్గెట్ చేసిన లక్ష్యాలను షార్ట్‌లిస్ట్ చేశాం. తరువాత తేదీ, సమయం నిర్ణయించారు. చివరికి మే 5న ఎవరికి ఏ ఉగ్ర స్థావరాలు టార్గెట్ ఇవ్వాలో నిర్ణయం జరిగింది. తరువాత మేం అనుకున్నట్లుగానే ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడి చేసి లక్ష్యాలు ఛేదించామని’ ఐఏఎఫ్ ఉన్నతాధికారి తివారీ చెప్పారు.