Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారని తెలిసిందే. నిపుణులు చేస్తున్న డిఎన్ఏ పరీక్షలో విజయ్ రూపానీ డెబ్ బాడీ మ్యాచ్ అయింది. ఈ విషయాన్ని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. డిఎన్ఏ టెస్టుల్లో డాక్టర్లు విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారని ధృవీకరించారు. ఆదివారం (జూన్ 15) సాయంత్రం విజయ్ రూపానీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఎయిరిండియా విమానం కూలిపోయింది. విజయ్ రూపానీ సహా విమానంలో 241 మంది చనిపోయారు. బ్రిటన్ పౌరసత్వం ఉన్న భారత్ కు చెందిన రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
హోం మంత్రి హర్ష్ సంఘ్వి ధృవీకరించారుఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చనిపోవడం బాధాకరం అన్నారు హోం మంత్రి హర్ష్ సంఘ్వి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "గుజరాత్ ప్రజల కోసం తన జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించిన నేత విజయ్ రూపానీ. అంకిత భావం కలిగిన నేత. అహ్మదాబాద్ నుంచి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. మృతదేహాలు చాలా వరకు కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ప్రభుత్వం ప్రయాణికుల కుటుంబసభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించింది. వాటిని డెడ్ బాడీలతో మ్యాచ్ చేస్తుండగా విజయ్ రూపానీ డీఎన్ఏ మ్యాచ్ అయింది. ఆదివారం ఉదయం 11:10 గంటలకు విజయ్ రూపానీ DNA ధృవీకరించారని’ చెప్పారు. అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో తేలిన DNA ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 250 మందికి పైగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల బృందం తక్షణ సహాయక చర్యలు మొదలుపెట్టాయి. బీజే మెడికల్ కాలేజీలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తుండగా.. విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు బాగా కాలిపోయయాయి. మరణించిన వారిని గుర్తించడానికి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో DNA నమూనాలను సరిపోల్చే పని జరుగుతోంది’ అని డాక్టర్ రాకేష్ జోషి చెప్పారు.