8th Pay Commission : 8వ వేతన సంఘంతో ఏ రాష్ట్ర ఉద్యోగుల జీతం ముందుగా పెరుగుతుంది - ఎక్కువ జీతం ఏ రాష్ట్ర ఉద్యోగులకు వస్తుందంటే.
8th Pay Commission : 8వ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.

8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇప్పుడు అందరి దృష్టీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదలపై పడింది. చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి ఈ కమిషన్ లో ఉద్యోగుల జీతాలు ఎంత పెరగొచ్చు? ఏ రాష్ట్ర ఉద్యోగులకు మొదట జీతం పెరుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా వేతన కమిషన్ పది పదేళ్లకు ఒకసారి మారుతుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ అమల్లో ఉండగా.. డిసెంబర్ 31, 2025తో దీని వ్యవధి ముగుస్తుంది. ఇది జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. ఇక ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వేతన సంఘం అమలులోకి వస్తే ముందుగా ఏ రాష్ట్రం ప్రభావితం అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందన్న విషయంపై ఇప్పవటివరకు ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించనప్పటికీ.. నిపుణుల అంచనాలు మాత్రం వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్రాలపై 8వ వేతన సంఘం ప్రభావం
8వ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. 7వ వేతన సంఘం సమయంలో, చాలా రాష్ట్రాలు కేంద్రం సిఫార్సులను ఆమోదించాయి. అయితే, ప్రతి రాష్ట్రం దాని విధానాలు, గడువులు మారుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కేంద్రం తన ఉద్యోగులపై 8వ వేతన కమిషన్‌ను అమలు చేసిన క్షణం నుండి, రాష్ట్రాల ఉద్యోగులపై కూడా 8వ వేతన కమిషన్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదు. కొత్త వేతన సంఘం సిఫార్సులు రాష్ట్రాలకు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సిఫార్సులను ఎలా అమలు చేస్తారంటే..
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం కొత్త సిఫార్సులను అమలు చేసినప్పుడే.. వాటిని ఎలా అమలు చేయాలనే దానిపైనా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఆ తరువాత, ప్రతి రాష్ట్రం దాని బడ్జెట్, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఒక ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రాలు తమ అవసరాలు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు వేతనాలను నిర్ణయిస్తాయి. అయితే, ప్రస్తుత వేతనాన్ని కొత్త పే స్కేల్‌గా మార్చడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగించబడుతుంది. కేంద్రం కూడా అదే చేస్తుంది.
ఉదాహరణకు, ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57. ఒకవేళ దీన్ని 2.86కి పెంచినట్లయితే, ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ జీతం 2.86తో గుణించాల్సి ఉంటుంది. అలా వచ్చే కొత్త సంఖ్య మీ పెరిగిన బేసిక్ జీతం అవుతుంది. ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతారు. 7వ వేతన సంఘం ప్రకారం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం 20-25 శాతం పెరిగింది.
ఏ రాష్ట్ర ఉద్యోగులకు మొదట జీతం పెరుగుతుందంటే..
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని అమల్లోకి తెచ్చిన వెంటనే.. రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అయితే వాటిని ఎలా అమలు చేయాలన్నది మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, గతంలో అమలైన వేతన కమీషన్ల నిర్ణయాలను పరిశీలిస్తే, పెద్ద, ధనిక రాష్ట్రాల్లో, ఈ సిఫార్సులు త్వరగా అమలు చేస్తున్నారు. 7వ వేతన కమిషన్ సమయంలో అయితే మొదటగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఉద్యోగులకు ముందుగా జీతాలు పెరిగాయి. ఇక ఏ రాష్ట్ర ఉద్యోగులకు ఎక్కువ జీతం అందుకుంటారు అన్న విషయానికొస్తే.. మునుపటి సిఫార్సుల ప్రకారం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల ఉద్యోగులకు ఎక్కువ జీతం వచ్చే అవకాశముంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్లనే.
Also Read : Sanjay Roy : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక అప్‌డేట్- సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు