Rohit Sharma News: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను పంచుకున్నాడు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ తో విబేధాలు ఉన్నాయన్న వ్యాఖ్యల్నికొట్టి పారేశాడు. ఆన్ ఫీల్డులో తీసుకునే నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, ఆఫ్ ఫీల్డులో ఇందుకు సంబంధించి కార్యచరణ రూపొందించుకుంటామని తెలిపాడు. అలాగే గంభీర్ ఆన్ ఫీల్డులో తమపై ఎంతో నమ్మకం ఉంచుతాడని, తామంతా కలిసి టీమ్ స్పిరిట్ తో పని చేస్తామని వెల్లడించాడు. నిజానికి ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో జట్టులో విబేధాలు నెలకొన్నట్లు కథనాలు వచ్చాయి. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలోని వ్యాఖ్యలు బయటకు వస్తుండటంపై గంభీర్ ఫైరయినట్లు తెలుస్తోంది.
సీనియర్లపై చర్చ..
ఇక గత కొంతకాలంగా విఫలమవుతున్న సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ లను పక్కన పెట్టాలని గంభీర్ యోచిస్తున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో స్వచ్చంధంగా టీమ్ నుంచి తప్పుకునేల రోహిత్ నిర్ణయం వెనకాల గంభీర్ హస్తముందని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే రోహిత్ తాజా వ్యాఖ్యలతో వాటికి చెక్ పడింది. జట్టులో ఎలాంటి విబేధాలు లేవని తెలుస్తోంది. ఇక తన కెప్టెన్సీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని రోహిత్ భావిస్తున్నట్లున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు తనే కెప్టెన్ కావడం, ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో అప్పటివరకు తానే భారత కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ లో పర్యటించే భారత జట్టు అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీనికి కెప్టెన్ గా ఎవరుండాలో బీసీసీఐ కాస్త సమయం తీసుకుని నిర్ణయిస్తుంది. మరోవైపు వన్డే జట్టులోకి కరుణ్ నాయర్ ను తీసుకోకపోవడంపై కొందరు మాజీలు ఫైరవుతున్నారు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సూపర్ ఫామ్ లో ఉన్న కరుణ్.. 752 పరుగులు చేసి సత్తా చాటాడని గుర్తు చేశారు.
దేశవాళీల్లో ఆడి లాభమేంటి..?
కరుణ్ నాయర్ ను జట్టులోకి తీసుకోకపోవడం షాకింగ్ గా ఉందని మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి అభిప్రాయ పడ్డాడు. దేశవాళీల్లో ఆడాలని, ఆ ప్రదర్శన బట్టే జాతీయ జట్టులో చోటు ఉందని చెబుతున్న బీసీసీఐ.. తాను చెప్పిన దాన్ని పాటించలేదని ఆక్షేపించాడు. బీసీసీఐ రూపొందించిన నిబంధనలను తానే అమలు చేయడం లేదని దుయ్యబట్టాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ కు వాస్తవానికి తగినన్ని అవకాశాలు రాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇండియా తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు ఇద్దరే. అందులో ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ కాగా, మరొకరు కరుణ్ నాయర్. అలాంటి ఆటగాడిని ప్రొత్సహించకుండా నిరాశ పర్చడం బాగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఫామ్ లో లేనప్పటికీ, సీనియర్లను ఇంకా జట్టులోకి ఎంపిక చేస్తున్నారని బోర్డును ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో సినీయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ నిలిచారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైతే వారి కెరీర్ కు ఎండ్ కార్డు పడే అవకాశముందని తెలుస్తోంది.