Adani-Hindenburg Row: అదానీ గ్రూప్ స్టాక్ ధరలను తారుమారు చేస్తూ అవకతవకలకు పాల్పడుతోందంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సెబీకి సుప్రీం కోర్టు మరికొంత సమయం ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి ఆగస్టు 14వ తేదీ వరకు అంటే అదనంగా 3 నెలల వరకు దేశ అత్యున్నత న్యాయస్థానం గడువు ఇచ్చింది. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు తాజా నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెబీకి ఆదేశాలు జారీ చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టులో విచారణను ముగించేందుకు 6 నెలల పాటు సమయాన్ని కోరుతూ సెబీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే 5 నెలల సమయం ఇచ్చినందు వల్ల విచారణ పూర్తి చేసేందుకు నిరవధిక పొడిగింపు ఇవ్వలేమని సుప్రీం కోర్టు ఉద్ఘాటించింది. 


తదుపరి విచారణ జులై 11కు వాయిదా


న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన బెంచ్.. ఈ విషయంలో కోర్టుకు సహకరించడానికి వీలుగా తమకు సమర్పించిన జస్టిస్ ఏఎం సప్రే కమిటీ నివేదికను పార్టీలకు అందుబాటులో ఉంచాలని సెబీని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జులై 11 కు వాయిదా వేసింది. అదానీ గ్రూప్ పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌ను బలోపేతం చేసే మార్గాలను సూచించాల్సిందిగా సెబీని కోరింది. అదానీ గ్రూపుపై విచారణ కోసం సుప్రీం కోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.


గతంలో రెండు నెలల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు


అంతకుముందు, ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగిన విచారణలో, హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. రెండు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆప్పట్లో నిర్దేశించింది. అయితే, విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని అత్యున్నత న్యాయస్థానానాన్ని సెబీ కోరుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రకారం 12 అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపేందుకు 15 నెలల సమయం పడుతుందని సెబీ కోర్టుకు వెల్లడించింది. ఆ లావాదేవీలు చాలా క్లిష్టమైనవని, అలాగే అనేక ఉప లావాదేవీలు కూడా అందులో ఉన్నాయని వివరించింది. సెబీ చెప్పిన ప్రకారం, కూలంకషంగా దర్యాప్తు చేయడానికి అనేక దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్‌లు అవసరం. 10 సంవత్సరాల కంటే పాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు కూడా ఇందుకు అవసరం. అవి పొందడానికి సమయం పడుతుంది. పైగా ఇది సవాలుతో కూడుకున్న పని. కాబట్టి, మరో ఆరు నెలలు గడువు ఇస్తే విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని న్యాయస్థానానికి సెబీ తెలిపింది.


అదానీ కేసు తెరపైకి వచ్చిన తర్వాత, 2023 మార్చి 2న, మార్కెట్‌ నియంత్రణ నిబంధనలను పటిష్టం చేయడంపై సిఫార్సులను అందించడానికి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం సప్రే అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని కూడా అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును ఆ కమిటీతో పంచుకున్నామని సెబీ కోర్టుకు తెలిపింది.