Madras High Court:


మద్రాస్ హైకోర్టు 


ఉద్యోగులకు తమ అభిప్రాయాలు స్వేచ్చగా వ్యక్తం చేసుకునే హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. వాట్సాప్‌లలో ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లను ఆధారంగా తీసుకుని వాళ్లపై చర్యలు తీసుకోవడం సరికాదని మందలించింది. తమిళనాడు గ్రామ బ్యాంక్ (Tamil Nadu Grama Bank) ఉద్యోగికి యాజమాన్యం ఓ మెమో జారీ చేసింది. వాట్సాప్‌ గ్రూప్‌లలో కంపెనీ గురించి పోస్ట్‌లు పెడుతున్నాడని ఆరోపించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశాడు ఉద్యోగి. ఈ పిటిషన్‌ని విచారించిన సమయంలోనో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ వాట్సాప్‌ గ్రూప్‌లలో పెట్టిన మెసేజ్‌లను ఆధారంగా చూపించి కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగిపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పిటిషనర్ లక్ష్మీనారాయణన్ తమిళనాడు గ్రామ బ్యాంక్‌లో గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్‌గానూ ఉన్నాడు. తనపై మెమో జారీ చేయడాన్ని సవాల్ చేసిన ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. జులై 29న వాట్సాప్ గ్రూప్‌లలో తాను షేర్ చేసిన మెసేజ్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కంపెనీ వార్నింగ్ ఇచ్చింది. కోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది. 


"ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. ఉద్యోగులకు, మేనేజ్‌మెంట్‌కి ఇలాంటి విభేదాలు రావడం చాలా సహజం. ఇలాంటి ఫిర్యాదులూ సహజమే. ఎలా స్పందిస్తారన్నది మేనేజ్‌మెంట్‌ వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మెమోల వల్ల కంపెనీ ప్రతిష్ఠకే భంగం వాటిల్లుతుంది. అప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకూ ఇలాంటి మెమోలు ఇవ్వడం సరికాదు"


- మద్రాస్ హైకోర్టు