Kolkata RG Kar Case: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో ఓ జూనియర్ డాక్టర్‌పైన జరిగిన దారుణమైన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అమానవీయ రీతిలో అత్యాచారం, హత్య జరిగిన ఈ మెడికల్ కాలేజీలో ఏబీపీ న్యూస్ ‘ఆపరేషన్ ఆర్జీ కర్’ పేరుతో ఓ స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ కాలేజీ యాజమాన్యం, పోలీసులు, ప్రభుత్వం అడుగడుగునా ఆలసత్వం ప్రదర్శించిందని విమర్శలు వస్తున్నాయి.


అయితే, ఏబీపీ న్యూస్ చేసిన పరిశోధనలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీలో ఈ హత్యాచార ఘటన జరిగిన వెంటనే ఈ కాలేజీ సిబ్బంది ఎలా యాక్టివ్‌గా మారారనే విషయం బయటికి వచ్చింది. అంతేకాక, ఈ దారుణమైన నేరంపై దర్యాప్తును ఎలా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారనేది వెలుగులోకి వచ్చింది. హత్యాచారం జరిగిన బాధితురాలికి పోస్టుమార్టం నిర్వహించిన టీమ్‌లో ఒకరైన డాక్టర్ తొలుత మాట్లాడేందుకు నిరాకరించారు. కానీ, కొన్ని సూటి ప్రశ్నలు వేయడంతో ఆ డాక్టర్ విప్పారు.





పోస్టుమార్టం చేసే విషయంలో ఎవరి నుంచి అయినా ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా.. డాక్టర్ దానిని ఖండించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. తాను అక్కడ ఉన్నంత సేపు కాలేజీ సిబ్బంది ఎలాంటి అవకతవకలు లాంటివి చేయలేదని.. వారు మరోలా చేసి ఉండవచ్చని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. అంతేకాక, ఈ కేసులో బయటి నుంచి లాయర్లను, ప్రిన్సిపల్‌కు చెందిన వ్యక్తులను కాలేజీ ఉన్నత సిబ్బంది పిలిపించిందనే అతిపెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ డాక్టర్ వెల్లడించారు. 





అలాగే ఆసుపత్రి ఆవరణలో చాలా చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా కాలేజీకి చెందిన ఓ మాజీ చీఫ్ ఎంతో అక్రమంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆయన మెడికల్ స్టూడెంట్స్, ప్రొఫెసర్‌లు అందరిని మానసికంగా ఒత్తిడికి గురి చేసేవారని ఆ డాక్టర్ అంగీకరించారు.