ABP Cvoter Exit Poll Results 2024: దక్షిణాదిలో కర్ణాటకలో బీజేపీ ఉనికి కాస్త గట్టిగానే ఉంది. సౌత్‌లో కాస్తో కూస్తో ఈ పార్టీకి క్యాడర్ ఉంది ఇక్కడే. పైగా మొన్నటి వరకూ ఇక్కడ అధికారంలోనూ ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరవాత ప్రతిపక్షానికే పరిమితమైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గట్టిగానే ప్రభావం చూపించినట్టు ABP Cvoter Exit Poll 2024 వెల్లడించింది. ఇక్కడ కనీసం 23-25 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 3-5 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఓటు శాతం పరంగా చూసినా దాదాపు 13% మేర రెండింటి మధ్యా అంతరం ఉంది. మొత్తం 28 ఎంపీ స్థానాలున్న కర్ణాటటకలో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగగా...బీజేపీ జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయగా..జేడీఎస్ మూడు చోట్ల బరిలో దిగింది. 


అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడలేదని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానైతే వచ్చింది కానీ పరిపాలనా పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ జాప్యం జరుగుతోందన్నది మరి కొందరి ఆరోపణ. డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య విభేదాలు వస్తాయని కొందరు అంచనా వేసినా అదేమీ జరగలేదు. ఇది కొంత వరకూ అక్కడి ప్రభుత్వం స్థిరంగా ఉండడానికి కారణమైంది.