బహుజన్‌ సమాజ్‌పార్టీకి చెందిన లీడర్‌ అర్షద్‌ రానా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఆఖరి నిమిషంలో పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఏడుస్తూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు వీలు కల్పిస్తామని పార్టీ పెద్దలు చెప్పారని ఇప్పుడు ఇలా మాట తప్పడం ఏంటని ప్రశ్నిస్తురాయన. 


"నాకు ఇది చాలా అవమానకరం. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆఫీస్‌ లోపల కూర్చోబెట్టి టికెట్‌ ఇస్తున్నట్టు అప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా పిలిచి నా బదులు వేరేవాళ్లకు ఎన్నికల్లో పోటీకి దించుతున్నట్టు చెప్తున్నారు." అని రానా ఏఎన్‌ఐ వార్తా ఏజెన్సీతో చెప్పారు. 


టికెట్‌ ఇవ్వాలంటే యాభై లక్షలు ఇవ్వాలని పార్టీ ఓ వ్యక్తి అడిగారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే నాలుగున్నర లక్షలు ముట్టచెప్పానన్నారు రానా. 


"ఇరవై నాలుగేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నాను. 2022లో ఛర్తావాల్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా నా పేరు 2018లో డిసైడ్‌ అయ్యింది.  ఇప్పుడు దీనిపై అడిగేందుకు పార్టీ పెద్దలతో మాట్లాడుతుంటే ఎవరూ సరిగా స్పందించడం లేదు. టికెట్ కోసం రూ. యాభై లక్షలు రెడీ చేయమన్నారు. ఇప్పటికే నేను నాలుగున్నర లక్షలు ఇచ్చేశాను. " అన్నారు రానా. 






రానా చేస్తున్న ఆరోపణలపై ఇప్పటి వరకు పార్టీ తరఫున ఎవరూ స్పందించలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా మాట్లాడుతూ... 403 నియోజకవర్గాలకు గానూ 300 సీట్లకు అభ్యర్థులు ఖరారు అయ్యారని... ఇందులో 90 మంది దళితులకు కేటాయించినట్టు ప్రకటించారు. 


బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా 2007 ఫార్ములాతోనే  ఈ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు పేర్కొన్నారు. దళితులు, బ్రాహ్మిణుల ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫ్రిబ్రవరి పది నుంచి మార్చి ఏడు వరకు పోలింగ్ చేపడతారు. మార్చి పదిన  కౌంటిగ్‌ జరగనుంది. 


Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి