సీడీఎస్ బిపిన్​ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేసిన కమిటీ వాయుసేనకు నివేదిక సమర్పించింది. ఈ ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, కుట్ర, నిర్లక్ష్యం కారణం కాదని నివేదికలో స్పష్టం చేసింది. కమిటీ ఈ మేరకు ప్రాథమిక నివేదిక అందజేసింది. 






వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్​ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశించిందని కమిటీ తన నివేదికలో వివరించింది. ఫలితంగా కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్​ ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వాయుసేన స్పష్టం చేసింది.


తమిళనాడులోని కూనూర్​ సమీపంలో 2021 డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ బిపిన్ రావత్. 2019 వరకు భారత్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ అనే పోస్ట్ లేదు. కార్గిల్‌ యుద్ధం అనంతరం 1999లో కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామక ప్రతిపాదన చేసింది. అయితే అది 2019 వరకు కార్యరూపం దాల్చలేదు. వాయుసేన, ఆర్మీ, నౌకాద‌ళం మూడింటికి వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. అయితే వారందర్నీ సమన్వయం చేసుకోవడానికి ఓ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో  సీడీఎస్ పదవిని కేంద్రం సృష్టించింది. 2019లో తొలిసారిగా బిపిన్ రావత్‌ను సీడీఎస్‌గా నియమించారు. త్రివిధ దళాల అధిపతిగా ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రి వరకూ ఉంది.



Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి