Pawan Kalyan Son Mark Shankar Injured | అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు. అటు నుంచి సింగపూర్ వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమారుడికి గాయాలైనట్లు తెలిసినా పవన్ కళ్యాణ్ తన పర్యటన రద్దు చేసుకోకుండా ఇచ్చిన మాట మేరకు టూర్ కొనసాగించారు.
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు భగవంతుని ప్రార్ధిస్తూ పోస్ట్ చేశారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ (PawanKalyan) అన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి షాక్ అయ్యాను. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి బలం, మనోధైర్యం చేకూరాలని లోకేష్ ఆకాంక్షించారు.
సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని మాజీ సీఎం జగన్ షాకయ్యారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు.
సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటనస్కూల్ బిల్డింగ్ లోజరిగిన అగ్నిప్రమాదంపై సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు స్పందించారు. 278, రివర్ వ్యాలీ రోడ్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఈరోజు ఉదయం 9:45 గంటలకు SCDFకి సమాచారం అందింది. 3 అంతస్తుల బిల్డింగులో రెండవ, మూడవ అంతస్తులలో మంటలు చెలరేగాయి. మూడవ అంతస్తు యూనిట్ వెలుపల ఒకచోట చాలా మంది వ్యక్తులు ఉన్నారు. నిర్మాణ కార్మికులు సహా మెటల్ స్కాఫోల్డింగ్ నిచ్చెనను ఉపయోగించి అగ్ని ప్రమాదం కారణంగా బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం.సమాచారం అందిన వెంటనే SCDF టీమ్ అక్కడికి చేరుకుని నిచ్చెనలు, కంబైన్డ్ ప్లాట్‌ఫారమ్ నిచ్చెన ద్వారా పైకి చేరుకుని దాదాపు 80 మందిని మేం రక్షించాం. దాదాపు 30 నిమిషాల్లోనే మూడు వాటర్ జెట్‌లతో మంటలను ఆర్పివేశారు. కానీ ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడగా.. వారిలో నలుగురు పెద్దవారు, 15 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు ఆసుపత్రులకు తరలించినట్లు SCDF టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.