Bhagwani Devi Dagar :  94 ఏళ్ల వయసు వాళ్లు ఎలా ఉంటారు ? ఎలా ఉన్నా ఉండటమే గొప్ప అనుకునే వయసు అది. కానీ భగవానీ దేవి దాగర్ అనే బామ్మ మాత్రం అలా అనుకోరు. తాను ఉన్నది రికార్డులు సృష్టించడానికే అనుకుంటారు. అందుకే ఆమె క్రీడల్లో ఇప్పటికీ రాణిస్తున్నారు.  'స్ప్రింటర్ దాదీ'గా ప్రసిద్ధి చెందిన 94ఏళ్ల భగవానీ దేవీ దాగర్.. ఫిన్‌లాండ్‌లోని టాంపేర్‌లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 2022లో మూడు పతకాలు సాధించింది. ఆమె ఖాతాలో ఒక గోల్డ్ మెడల్ కూడా ఉండడం గమనార్హం. ఇక మొత్తంగా ఓ స్వర్ణం, రెండు కాంస్య పతకాలను ఆమె అందుకుని రికార్డ్ నెలకొల్పింది.





మంచానికే పరిమితం కావాల్సిన ఏజ్‌లో పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్ కొట్టిన ఆమె స్థైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. భగవానీ దేవి 100మీటర్ల స్ప్రింట్‌లో పాల్గొని.. 24.74సెకన్లలో ముగింపు గీతను దాటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇక ఆమె తండ్రి ఒక్కప్పుడు పారా అథ్లెట్. ఆయన స్ఫూర్తితోనే తాను ఇన్నేళ్లుగా చెక్కుచెదరని ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొంటున్నానని దేవి పేర్కొంది. 94ఏళ్ల ఈ బామ్మ షాట్‌పుట్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది.


ఫిన్ లాండ్‌ను పతకాలతో వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ రేంజ్ వెల్కం లభించింది. 





అంతకుముందు చెన్నైలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. దీంతో ఆమె ఫిన్‌లాండ్‌లో జరిగే ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022కు ఎంపికైంది. అంతకుముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు, షాట్‌పుట్ మరియు జావెలిన్ త్రోలో మూడు బంగారు పతకాలను కూడా దేవీ అందుకుంది.